వారి బతుకులను భరోసా కరువు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 9: ఆదివాసుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వంద వైఖరిని అవలంబిస్తూ, వారి బతుకులను చిద్రం చేసి మనుగడ లేకుండా చేస్తున్నాయని రాష్ట్ర ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆరోపించారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు శుక్రవారం స్థానిక ప్రెస్ భవన్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవీందర్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ ఆదివాసి ప్రాంతంలో హరితహరం పేరుతో పోడు భూములలో చెట్లు నాటుతూ ఆదివాసి బతుకులను విచ్ఛిన్నం చేస్తున్నారని విమర్శించారు. అటు పోలవరం ప్రాజెక్టులో రెండు లక్షల మంది జల సమాధి కాగా, అక్కడున్న ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆదివాసుల సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, కుటుంబానికి 10 ఎకరాల భూమి ఇవ్వాలని, ఆదివాసులపైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, ఆదివాసి ప్రాంతాన్ని స్వయం పరిపాలన ప్రాంతంగా ప్రకటించాలని, ఆదివాసీ ప్రాంతంలో మెరుగైన విద్య, వైద్యం, ఉద్యోగం కల్పించాలని రవీందర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మార్వాడీ సుదర్శన్, పోడెం రాజయ్య, నరేష్, గణేష్, ప్రవీణ్, శివ ప్రసాద్, చందు తదితరులు పాల్గొన్నారు.