JMS News Today

For Complete News

భలే పంతుళ్ళు….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూన్ 28: ఆ ఉపాధ్యాయుల స్ఫూర్తి అందరికి ఆదర్శం. ఈ ఆపన్న హస్తాలే లేకపోతే ఆ పిల్లాడి భవిష్యత్ ఏమయ్యేది..? మానవ సంబంధాలు మంటగలసిన ఈ సమాజంలో మనసున్న మారాజులు ఉన్నారని నిరూపించారు ఆ పాఠశాల ఉపాధ్యాయులు. వివరాల్లోకి వెళితే.. పేరు..అజయ్..ఊరు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట. అందులో దళిత బిడ్డ…ఫస్ట్ జనరేషన్…రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం…అమ్మానాన్నలిద్దరు కూలి పనులు చేస్తూ పిల్లలిద్దర్ని పోషించుకుంటున్నారు. అజయ్ కి ఎన్నో కలలు…బాగా చదవాలి…మంచి జాబ్ సంపాదించాలి..తమ్ముడిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి… ఊహ తెలిసినప్పటి నుంచి ఏం తిన్నారో…, ఏరోజు ఉపవాసం ఉన్నారో తెలియని అమ్మానాన్నలను పెద్దయ్యాక బాగా చూసుకోవాలనేవి తన ఆశయాలు…తన ఆశలు, ఆశయాలకు తగినట్లే ఊరిబడిలో టెన్త్ కష్టపడి చదివాడు. మొన్నటి ఫలితాల్లో 9.7 GPA సాధించాడు. బాసరలో త్రిపుల్ ఐటీ సీట్ కొట్టేశాడు. సీట్ వచ్చిన విషయాన్ని తల్లిదండ్రులకు సంతోషంగా చెప్పాడు. ఖర్చెంతయితది బిడ్డా అని తండ్రి అడిగితే… ఫీజ్ Rs 9,200 అని చెప్పాడు. ఇంట్లో వందలకు మించి ఎప్పుడూ ఉండని దీన స్థితి. అన్ని పైసలు మన వద్ద లేవు బిడ్డా! అప్పు ఎక్కడైనా పుట్టినా… మళ్ళ కట్టలేం! చదువు ఆపేయ్ అని తండ్రి ఏడుస్తూ చెప్పి కూలి పనికి వెళ్ళిపోయాడు. కొడుకు దురదృష్టానికి కంటతడి పెడుతూ ఆవెనుకే తల్లీ వెళ్ళింది. తను కన్న కలలన్నీ కల్లలయ్యాయని అజయ్ గట్టిగా ఏడువాలనుకున్నాడు. కానీ ఏడ్పు రాలే! మౌనంగా ఉండిపోయాడు. పేదరికమే తన చదువుకు శాపమవుతుందని తానెన్నడూ ఊహించలేదు. ఇంటినుంచి బయటికి వెళ్ళబుద్ధికాలే! ఆనోటా ఆనోటా అజయ్ ట్రిపుల్ ఐటీలో జాయిన్ కావడంలేదని స్కూల్లో టీచర్లకు తెలిసింది. వెంటనే హెచ్ఎం సహా టీచర్లందరూ అజయ్ ఇంటికి వెళ్లారు. గురువులను చూడగానే… అజయ్ బావురుమని ఏడ్చాడు. హెచ్ఎం వెంకటేశ్వర్లు అజయ్ ని దగ్గరకు తీసుకొని “అజయ్. నీకు అండగా మేమున్నం! రేపే మనం బాసర వెళ్తున్నం! ఫీజు కట్టి వద్దాం! డబ్బు గురించి నువ్వు మర్చిపో” అని ధైర్యం చెప్పి స్కూలుకు వచ్చారు. స్టాఫ్ మీటింగ్ పెట్టి “అజయ్ కి నేనొక పదివేల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నా” అని హెచ్ఎం చెప్పాడు. వెంటనే ఇద్దరు టీచర్లు… K.సుజాత, మహోదర్ రావులు కూడా పదివేల చొప్పున ప్రకటించారు. చంద్రశేఖర్, అంజారెడ్డి, వేణుగోపాల్ రావు, సుధాకర్ రెడ్డి, సుజాత టీచర్ తలో ఐదేసి వేల చొప్పున ఇస్తామన్నారు. ఈమొత్తం రూ 55 వేలు అయ్యాయ్! మరుసటి రోజు అందరు డబ్బు తెచ్చి పెద్దసారు కిచ్చారు. హెచ్ఎం వెంటనే అజయ్ ని బాసర తీసుకెళ్లి… ఫీజు కట్టి వచ్చారు. ఊరిబడి సార్లు పిల్లగాని చదువుకు 55 వేల రూపాయలు ఇచ్చారని తెల్సి గ్రామ సర్పంచ్ బద్ధం తిరుపతిరెడ్డి గారు, నూతనంగా జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైన కొండపల్కల రాంమోహన్ గారు స్కూలుకు వచ్చి ఉపాధ్యాయులను మనస్ఫూర్తిగా అభినందించారు. తామూ సహాయం చేస్తామని చెప్పి వెంటనే తలో ఐదువేల రూపాయలు హెచ్ఎం కిచ్చారు. నేతాజి యూత్ క్లబ్ వారు రూ 5 వేలు, NRI రూ 15 వేలు… మొత్తం 85 వేల రూపాయలు జమైనయ్! ఫీజులు, ఇతర ఖర్చులు పోగా, మిగతా డబ్బును అజయ్ పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు హెచ్ఎం వేంకటేశ్వర్లు నాతో అన్నారు. ఇది పలువురికి స్ఫూర్తి! ఈ వితరణ మరెందరికో ఆదర్శం! ఒక పేదింటి బిడ్డ చదువుకు ఆర్థికంగా చేయూతనిచ్చిన ముత్యంపేట ఊరిబడి టీచర్లు, ప్రజాప్రతినిధులు అందరు అభినందనీయులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *