JMS News Today

For Complete News

మొదటి అదృష్టవంతులు వారే…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, డిసెంబర్ 19: ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎట్టకేలకు వారి దరిచేరాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటిగా కరీంనగర్ నియోజకవర్గంలో 67మంది లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. ఆదివారం కొత్తపెల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో నిర్మించిన 67 డబుల్ బెడ్ రూం ఇండ్లను జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ లక్కీ డ్రా ద్వారా లబ్దిదారులకు కేటాయించి గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపుతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయని అన్నారు. కరీంనగర్ జిల్లాలోనే కొత్తపెల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లకు విద్యుత్ మీటర్లు, త్రాగునీటి సరఫరా కల్పించినట్లు ఆయన అన్నారు. నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్ రూంల సొంత ఇండ్ల కల సాకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తండ్రి లాంటి వాడని, దైవంతో సమానమని, దైవ స్వరూపులని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు. కమాన్ పూర్ గ్రామం రాములపల్లిలో 47 కుటుంబాలు ఎల్.ఎం.డి ముంపుకు దగ్గరగా ఉన్నాయని, వారికి రిహాబిలిటేషన్ కింద ఇండ్లు కేటాయించామని ఆయన తెలిపారు. 47 మందిలో 36 కుటుంబాలకు ఆదివారం డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించామని, మిగిలిన 11 మందికి గ్రామ సభ ద్వారా అధికారులు అర్హులైన వారికి కేటాయిస్తారని ఆయన తెలిపారు. మిగిలిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కమాన్ పూర్ గ్రామస్తులకు లాటరీ ద్వారా కేటాయించామని, వారందరూ ఇవాళ కుటుంబ సభ్యులతో సహా సంతోషంగా గృహప్రవేశాలు చేశారని మంత్రి తెలిపారు. రాములపల్లి గ్రామస్తులు గృహాలను వెంటనే ఖాళీ చేసి నూతంగా కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి వెంటనే మారాలని ఆయన కోరారు. ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్దిదారులు ఎవరికి అమ్ముకోరాదని, ఇతరులకు కిరాయికి ఇవ్వరాదని, ఇది చట్టరీత్యా నేరమని లబ్దిదారులు మాత్రమే స్వంత డబుల్ బెడ్ రూం ఇండ్లలో నివసించాలని ఆయన కోరారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు రానివారు అధైర్య పడవద్దని అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్ తో కలిసి డబుల్ బెడ్ రూం ఇండ్లు సీరియల్ నెం. 7,8,9,10,11 గృహాలలో లబ్దిదారులతో కలిసి గృహప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఎలక్ట్రిసిటీ డి.ఈ. రాజిరెడ్డి, ఏడి రాజు, ఎం.పి.పి శ్రీలత-మహేష్, కొత్తపెల్లి తహశిల్దార్ శ్రీనివాస్, ఎంపిటిసిలు, జెడ్పిటిసిలు, తదితరులు పాల్గొనారు.

Leave a Reply

Your email address will not be published.