అమ్మ వారి ఆలయాల్లో వరలక్ష్మి పూజలు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 9: శ్రావణ మాసం వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు అమ్మవారి ఆలయాల్లో వరలక్ష్మి పూజలు, సామూహిక కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతి నగర్ సంతోషిమాత ఆలయం, మహాలక్ష్మి ఆలయం, సంతోష్ నగర్ సంతోషిమాత ఆలయం, నగునూర్ లోని దుర్గ భవానీ ఆలయంతోపాటు పలు ఆలయాల్లో అర్చకులు వరలక్ష్మి పూజలు, కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కావడంతో ఉదయాన్నే లేచిన మహిళలు స్నానాలాచరించి కొత్త దుస్తులు ధరించి అమ్మ వారి దర్శనం కోసం ఆలయాల వద్ద బారులు తీరారు. దీంతో ఆలయాల్లో సందడి నెలకొనగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాలు కిటకిటలాడాయి. తమ కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి అంటూ మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇంటికి వచ్చిన మహిళలు ముత్తయిదువులకు పసుపు కుంకుమ అందజేశారు. మొత్తానికి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మ వారి ఆలయాలు మహిళా భక్తులతో కిటకిటలాడాయి.