అయోధ్య రాముడిదే…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
ఢిల్లీ, నవంబర్ 9: ఎన్నో ఏళ్ళుగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య కేసుకు సంబంధించి చారిత్రాత్మక తీర్పు వెల్లడైంది. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీం కోర్టు శనివారం తుది తీర్పునిచ్చింది. అలాగే ముస్లింలకు అయోధ్యలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ‘అయోధ్య ట్రస్ట్’ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసుకు అధికరణం 47 వర్తించదని సీజేఐ గొగోయ్ స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాలు ఉన్నప్పుడే 47వ అధికరణం వర్తిస్తుందని అన్నారు. 12 ఏళ్ల తర్వాత సున్నీ వక్ఫ్ బోర్డు ఈ కేసులో వ్యాజ్యం దాఖలు చేసిందని చెప్పారు. తమ నిర్ణయానికి ముందు ఇరు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. కాగా, అయోధ్య తీర్పు సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలను సంయమనం పాటించాలని కోరారు.