వాటి సరసన తెలంగాణ…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 29: పేదలకు ఉచిత ఉత్తమ వైద్య సేవలందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి, రెండో స్థానంలో ఉన్న కేరళ, తమిళనాడు సరసన చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ లోని రాంనగర్ లో నూతనంగా రూ.60 లక్షలతో నిర్మించిన ఆయుష్ ఆసుపత్రి విభాగాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాడు ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు నమ్మకం లేక ప్రభుత్వ ఆసుపత్రులు వెలవెలపోయాయని, కానీ ఐదేళ్ళ కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం కలిగించామని తెలిపారు. తెలంగాణ ఆరోగ్య సూచికలో దేశంలోనే అగ్రగ్రామిగా ఉందని చెప్పారు. వైద్య రంగంలో అనుబంధంగా ఉన్న ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి, హల్లోపతి వైద్యం కన్నా పేద ప్రజలకు ఆయుష్ అందుబాటులో ఉంటుందని అన్నారు. హల్లోపతి ద్వారా నయం కానీ కీళ్ళనొప్పులు, షుగర్ వ్యాధి, బీపీ, పక్షవాతం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు అతి తక్కువ ఖర్చుతో మన పరిసర ప్రాంతాల్లో లభించే వన మూలికలతో తయారు చేయబడిన ఆయుష్ వైద్యం ద్వారా పూర్తిగా నయమవుతాయని పేర్కొన్నారు. జిల్లాలో ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి, ప్రకృతి వైద్యాన్ని పరిపుష్టం చేసి, నగర ప్రజలకు మరింత ఎక్కువ వైద్య సేవలను అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తోపాటు వైద్యాధికారులు, వైద్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.