అమ్మ మురిసింది…ఆమె పరవశించింది
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, అక్టోబర్ 24: సద్దుల బతుకమ్మతో కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలు పూల వనాలయ్యాయి. రంగురంగుల తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మను కీర్తిస్తూ పాడిన ఆడపడుచుల వినసొంపైన ఆట పాటలతో గౌరమ్మ మురిసిపోగా, బతుకమ్మ ఆటపాటల్లో తేలియాడిన మహిళలోకం పరవశించిపోయింది. ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన సద్దుల బతుకమ్మ వేడుకలు శనివారం జిల్లాలోని పలుచోట్ల కన్నుల పండువగా, ఆకాశమే హద్దుగా కొనసాగాయి. తెలంగాణ సంస్కృతిని పల్లె జీవన శైలిని చాటి చెప్పే విధంగా వేలాది మంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాము అయే చందమామ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ.. అంటూ బతుకమ్మను కీర్తిస్తూ పాడిన ఆట పాటలు పల్లెలు పట్టణాల్లో మారుమ్రోగాయి. ఉదయమే లేచిన మహిళలు తలంటూ స్నానాలాచరించి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బిజీ బిజీగా ఉంటూ బతుకమ్మను అందంగా పేర్చి బతుకమ్మ మధ్యన గౌరమ్మను ఉంచారు. సాయంత్రం ఇంటి వాకిళ్ళలో కొద్దిసేపు బతుకమ్మను పెట్టి బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మ ఆడే మైదానాలకు బతుకమ్మలతో మహిళలు చేరుకొని గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి రాత్రి వరకు ఆట ఆడగా, సద్దుల బతుకమ్మ వేడుక ఉత్సవంలా కొనసాగింది. అనంతరం చెరువులు, కుంటల్లో బతుకమ్మలను వదులుతూ గౌరమ్మ తల్లి వెళ్లి రావమ్మా.. మళ్లీ రావమ్మ అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం మహిళలు సత్తు పిండి వాయినాలు ఒకరికొకరు అందజేసుకున్నారు. కాగా, ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు వారివారి ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాల్లో పాలు పంచుకున్నారు. అటు పోలీసు అధికారులు ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టారు.