ఢిల్లీలో మొదలై గల్లీ దాకా….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, డిసెంబర్ 8: సాధారణంగా సమస్య తీవ్రతను బట్టి గల్లీ నుంచి మొదలై ఢిల్లీ వరకు అగ్గి రాజుకునే పోరాటాలు చూశాం. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఢిల్లీ నుంచి మొదలై గల్లీ వరకు పాకింది ప్రస్తుత రైతు ఉద్యమం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత 13 రోజులుగా పోరు కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడంలో ఆలస్యం జరుగుతుండటంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు మంగళవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. రైతు పోరుకు బిజెపి మినహా అన్ని రాజకీయ పక్షాలు పూర్తి మద్దతు పలికాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ మద్దతు పలకడంతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆందోళనలు నిర్వహించారు. అలాగే బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు, పలు ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, వర్తక, వాణిజ్య వర్గాలు ఇలా అన్ని పాలు పంచుకోవడంతో భారత్ బంద్ బగ్గ జరిగింది. బస్సులు రోడ్డెక్కలేదు. ఫలితంగా ప్రజా రవాణా స్థంభించిపోయింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసి ఉండటంతో ఆ ప్రాంతాలు బోసిపోయి కన్పించాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బంద్ వాతావరణం కన్పించింది. ఆ తరువాత మెల్లమెల్లగా దుకాణాలు తెరుచుకున్నాయి. బస్సులు కూడా కదిలాయి. కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్, హుజూరాబాద్ లో మంత్రి ఈటెల రాజేందర్ బంద్ లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు వారివారి ప్రాంతాల్లో పాలుపంచుకున్నారు. కాగా, బంద్ సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మొత్తానికి ఢిల్లీలో మొదలై గల్లీ వరకు పాకిన రైతు ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడంతో రైతు భారత్ బంద్ సక్సెస్ అయింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం బంద్ లకు పెద్దగా ప్రభావం కన్పించకపోయినప్పటికీ రైతు భారత్ బంద్ మాత్రం సక్సెస్ కావడం విశేషం.