టాప్ ఆర్డర్ బేజారు ….కప్పు చేజారే….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
మాంచెస్టర్, జూలై 10: ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా సెమీస్ పోరులో మ్యాచ్ చేజారింది. న్యూజిలాండ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్ 18 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పోరాడి ఓడిన కోహ్లీసేన మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. చివరి వరకు ఆడిన ధోనీ-జడేజాల పోరాటం వృథా అయింది. రవీంద్ర జడేజా(77) 59 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు, మహేంద్రసింగ్ ధోనీ(50) 72 బంతుల్లో ఫోర్, సిక్స్) అర్ధశతకాలతో రాణించడంతో భారత్ గెలుస్తుందని భావించారు. ఐతే ఆఖర్లో ధోనీ రనౌట్ కావడంతో భారత్ విజయంపై ఆశలు నీరుగారిపోయాయి. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు, బౌల్ట్, శాంట్నర్ రెండేసి వికెట్లు తీసి భారత్‌ను భారీ దెబ్బకొట్టారు. భారత్ బ్యాట్స్మెన్లలో కేఎల్ రాహుల్(1), రోహిత్ శర్మ(1), విరాట్ కోహ్లీ(1), దినేశ్ కార్తీక్(6) దారుణంగా విఫలమయ్యారు. వీరిలో ఏ ఒక్క బ్యాట్స్‌మన్ నిలబడినా భారత్‌కు విజయతీరాలకు చేరేది. మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్(32), హార్దిక్ పాండ్య(32) కొంతసేపు పోరాడటంతో భారత్ రేసులో నిలిచింది. మొత్తానికి భారత్ ఓటమి కోట్ల మంది అభిమానులను నిరాశపరిచింది