వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
మాంచెస్టర్, జూన్ 27: ప్రపంచకప్లో కోహ్లీసేన జైత్రయాత్ర కొనసాగుతోంది. భారత్ నిర్దేశించిన 268 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 34.2 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌట్ అయింది. 125 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. భారత బౌలర్లు మహ్మద్ షమీ, జస్ర్పీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ ముందు కరీబియన్లు నిలవలేకపోయారు. ఏ దశలోనూ భారత్కు పోటీ ఇవ్వలేకపోయారు. విండీస్ ఆటగాళ్లలో ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్ చేసిన 31 పరుగులే అత్యధికం. నికోలస్ పూరన్ 28, హెట్మెయిర్ 18 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ డబుల్ డిజిట్ దాటలేదు. ఈ విజయంతో భారత్ దాదాపు సెమీస్కు చేరుకోగా, విండీస్ సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. ఆడిన ఆరు మ్యాచుల్లోనూ విజయం సాధించిన భారత్ 11 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ 48 పరుగులు చేయగా, కెప్టెన్ కోహ్లీ, ధోనీలు అర్ధ సెంచరీలతో రాణించారు. కోహ్లీ 72 పరుగులు చేయగా, ధోనీ 56 పరుగులు చేశాడు. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. 38 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. ప్రపంచకప్లో భారత్కు ఇది వరుసగా ఆరో విజయం. భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, చాహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పాండ్యా, కుల్దీప్లు చెరో వికెట్ తీసుకున్నారు. 72 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.