కాషాయ దండు ఏం చేసిదంటే…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 22: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇవ్వకుండా ఉండడమే కాకుండా పేద ప్రజలను దోపిడీ చేసే ఎల్ఆర్ఎస్ ఛార్జీలతో భారం మోపడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట బిజెపి శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ క్రమంలో పలుచోట్ల పోలీసులకు, కార్యకర్తలకు మధ్య జరిగిన పెనుగులాటలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. కలెక్టరేట్ పరిసరాలు నినాదాలతో మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా
శాఖ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు మాట్లాడుతూ అధికార తెరాస ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ మాయమాటలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి రాగానే అన్ని హమీలు విస్మరించారని మండిపడ్డారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్నో పధకాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు అందిస్తున్నా, ఆయా పథకాల కింద అభివృద్ధి చేయకుండా అట్టి డబ్బును దారి మళ్లిస్తూ అధికారమే పరమావధిగా నిజాం వారసులైన ఎంఐఎం పార్టీ తో జతకట్టి మెజారిటీ ప్రజల మనో భావాలకు విరుద్దంగా పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందించినప్పటికీ నామమాత్రంగా నాణ్యత లేని ఇళ్లను కట్టిస్తూ కేంద్ర ప్రభుత్వ నిదులని దారి మళ్లిస్తూ పేద ప్రజల నోర్లు కొడుతున్నారని ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో పేదల నుంచి లక్షల కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్ నిబంధనలను సులభతరం చేస్తూ అందరికి అందుబాటులో తేవాలని బాస డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ డి శంకర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ, కన్నబోయిన ఓదెలు, కొరటాల శివరయ్య, దిశా కమిటీ మెంబర్ రామ్ గోపాల్ రెడ్డి, బిజెపి నగర అధ్యక్షులు బేతి మహేందర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బోయిన పల్లి ప్రవీణ్ రావు, కార్పొరేటర్లు రాపర్తి విజయ, చొప్పరి జయశ్రీ , నక్క పద్మ, కచ్చు రవి దురిశెట్టి అనూప్, పెద్దపెల్లి జితేందర్, రాపర్తి ప్రసాద్, నాయకులు కన్న క్రిష్ణ, గుర్రం పద్మా రెడ్డి లతోపాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.