JMS News Today

For Complete News

స్వాగతించలేక…కుట్రలా….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, అక్టోబర్ 31: హుజురాబాద్ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అనేక అడ్డదారుల్లో గెలవడానికి ప్రయత్నించినా, ప్రజలందరూ బిజెపి అభ్యర్థి రాజేందర్ వైపు నిలబడ్డారని, నియోజకవర్గ ప్రజలంతా ఓటుతో ఇచ్చిన తీర్పును టిఆర్ఎస్ స్వాగతించి గౌరవించలేక ఈవీఎంల అవకతవకలతో గందరగోళ పరిస్థితులు సృష్టించి లబ్ధి పొందాలనుకోవడం ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనమని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. హుజరాబాద్ ఎన్నికల అనంతరం ఈవీఎంల తరలింపులో అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక కుట్రలు కుతంత్రాలు చేసిందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడానికి అనేక హామీలు గుప్పించి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసిందని, దళితుల ఓట్లు దండుకోవడానికి దళిత బంధు పథకాన్ని కూడా తీసుకువచ్చి అమలు చేయలేక రాజకీయ డ్రామాలు చేసిందని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా టిఆర్ఎస్ పార్టీ ఓటుకు ఆరు వేల చొప్పున డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. హుజరాబాద్ లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా అనేక ప్రయత్నాలు చేసిందని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంతో పాటు భయబ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వనున్నారని, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తున్నారని సర్వేల రిపోర్టు రావడంతో, నియోజకవర్గం అంతా ఈటల గెలుస్తారని ప్రచారం జరగడంతో జీర్ణించుకోలేని టిఆర్ఎస్ ఈవీఎంలతో అక్రమాలు చేసి అవకతవకలకు పాల్పడే చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజా తీర్పును గౌరవించలేని టిఆర్ఎస్ ఈవీఎంల తరలింపులో గందరగోళ పరిస్థితులు సృష్టించి కుట్ర చేస్తుందన్నారు. ఈవీఎం తరలింపులో ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కిందిస్థాయి అధికారులు మొదలుకొని పైస్థాయి కలెక్టర్, పోలీస్ కమిషనర్ వరకు అధికారులు అందరూ అలసత్వాన్ని ప్రదర్శించారని, ఎన్నికల యంత్రాలు మార్పు చేసి కార్లో తరలించడం అనేక అనుమానాలకు దారి తీస్తుందని చెప్పారు. ఈవీఎంల అవకతవకలపై, అక్రమాలపై గందరగోళ పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, కార్యదర్శి రాపర్తి ప్రసాద్, అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు మర్రి సతీష్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు గాయత్రి, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, బిజెపి జిల్లా కార్యదర్శి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సోమిడి వేణు, కటకం లోకేష్, మాడుగుల ప్రవీణ్ కుమార్, కార్పొరేటర్లు అనుప్, కచ్చు రవి, బండ రమణారెడ్డి, జోనల్ అధ్యక్షులు నాగసముద్రం ప్రవీణ్, ఆవుదుర్తి శ్రీనివాస్, పాదం శివరాజ్, నేలకొండ ప్రసన్న రావు , ఎలుక అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *