పథకం పేర్లు మార్చడం సిగ్గు చేటు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 21: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వంద శాతం నిధులతో చేపట్టిన పథకాల పేర్లు మార్చి వికృత చర్యలకు పాల్పడడం కేసిఆర్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టె మురళీకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 109 కోట్ల రూపాయల అమృత్ పథకం నిధులతో కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో నిరంతర నీటి సరఫరా అభివృద్ధి పనులు చేపట్టారని, ఆ పథకం పేరు మార్చు కెసిఆర్ జలం పేరిట మంత్రులు కేటీఆర్ గంగుల కమలాకర్ లు ప్రారంభించడం సిగ్గుచేటని విమర్శించారు. దేశవ్యాప్తంగా అమృత్ పథకం లో భాగంగా 100 నగరాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ పథకం లో కరీంనగర్ నగరాన్ని చేర్చి కరీంనగర్ నగరవాసుల దాహార్తిని తీర్చేందుకు నిధులు కేటాయించినట్లు ఆ విషయం ప్రజలకు అధికారులకు తెలుసని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, స్థానిక పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఫోటోలు లేకుండా ఈ పథకాన్ని ప్రారంభించడం కేటీఆర్ గంగుల కమలాకర్ ల అహంకార పూరిత వికృత చేష్టలకు నిదర్శనంగా భావించాలని, దీనిని ప్రజలంతా గమనించాలని కోరారు. గత పన్నెండు సంవత్సరాల నుంచి నిరంతర నీటి సరఫరా పేరుతో కరీంనగర్ ప్రజలను మభ్య పెట్టిన గంగుల కమలాకర్ అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులతో నిరంతర నీటి సరఫరా పూర్తి చేసిన విషయాన్ని దాచిపెట్టి మీడియా ద్వారా ఆహ్వానం పంపించినట్లు నాటకాలు ఆడడం హాస్యాస్పదంగా విడ్డూరంగా ఉందని అన్నారు. అమృత్ పథకం పేర్లు మార్చి కెసిఆర్ జలం అంటూ చేర్చిన పేరును తొలగించాలని మురళీకృష్ణ హెచ్చరించారు.
కరోనా పరిస్థితుల్లో సమీక్షలు చేయకుండా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఐసోలేషన్ వార్డును సందర్శించకుండా ప్రచార ఆర్భాటాలతో ప్రారంభోత్సవాలు చేయడం ప్రజల క్షేమం పై ఆరోగ్యంపై మంత్రులు కేటీఆర్ గంగుల కమలాకర్ కు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి, కరీంనగర్ నగరానికి అభివృద్ధి పనుల్లో స్మార్ట్ సిటీ అమృత్ మిషన్ భగీరథ పథకాల్లో అందించిన నిధులు, మంత్రి కమలాకర్ నగరపాలక సంస్థ వ్యవహరించిన తీరుపై త్వరలోనే అన్ని విషయాలు ప్రజల ముందు వివరిస్తామని, త్వరలోనే కొందరి అవినీతి బాగోతం బహిర్గతం చేస్తామని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టె మురళీకృష్ణ వివరించారు.