JMS News Today

For Complete News

వాళ్ళు ఏడిస్తే..అరిష్టమే….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, నవంబర్ 11: కర్షకుల కష్టాలపై కమల దండు పోరు బాట పట్టింది. సన్న రకాలకు రూ.2500 చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు రోదన పేరిట బుధవారం కలెక్టర్ ఎదుట బిజెపి శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పంట పండించే రైతులను రాష్ట్ర ప్రభుత్వం గోస పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. నియంత్రిత సాగు పేరుతో నిరంకుశ తత్వంతో రైతులపై షరతులు పెట్టి సన్నరకం వడ్లను పండించాలని ఒత్తిడి చేసిన ప్రభుత్వం అట్టి రైతులను పట్టించుకునే పరిస్థితిలో లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం మాటలు విని సన్నరకం వడ్లను వేసిన రైతులు నేడు నట్టేట మునిగిపోయారని, చీడ పీడలతో, ప్రకృతి బీభత్సంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు లేనిదే రాజ్యం లేనిదని, ఎద్దేడిసిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్ర లో లేదని, అలాంటిది రైతులును రాష్ట్ర ప్రభుత్వం ఏడిపించే చర్యలు చేపడితే ఆ ప్రభుత్వానికి అరిష్టమని, ప్రభుత్వ పతనం ఇక్కడి నుండి ఆరంభం అవుతుందని ఆయన హెచ్చరించారు. సన్నరకం వడ్లను పండించడానికి రైతులు నానా ఇబ్బందులు పడి అధిక ఖర్చులు చేసి పెట్టుబడి కూడా రాలేని దుస్థితిలో ఉన్నారని, దీనికి రాష్ట్ర ప్రభుత్వ కారణమేనని ఆయన ఆరోపించారు. నిరంకుశత్వంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టే చర్యలు సరైనవి కావని, ప్రస్తుతం నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తాలు, తరుగు, రంగు పేరుతో రైతులపై ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ప్రతి గింజను కొనుగోలు చేయడానికి సత్వరం చర్యలు చేపట్టి, క్వింటాలు సన్న వడ్లకు రూపాయలు 2500 ఇప్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు రోదిస్తూ ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కరెక్ట్ కాదని తక్షణం ప్రభుత్వం రైతుల విషయంలో స్పందించి పంటలను కొనుగోలు చేయడానికి అన్ని చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుండా రైతుల విషయాన్ని గాలికి వదిలేసి ప్రభుత్వం మొద్దు నిద్ర లో ఉందని విమర్శించారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో 1,21,970 ఎకరాల్లో నియంత్రిత సాగు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులతో నిర్బంధంగా సన్నరకం పంటను సాగు చేయించిందని ఇప్పుడు ఆ పంట పండించిన రైతులంతా తాము పెట్టిన పెట్టుబడి రాక దిక్కు తోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఇద్దరు మంత్రులు ఉండి కూడా ఉత్సవ విగ్రహాలుగా మారారని అన్నారు. ముఖ్యంగా ఆ శాఖను చూస్తున్న మంత్రి కూడా జిల్లా రైతాంగం గురించి పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం రైస్ మిల్లర్ల చేతిలో కీలుబొమ్మగా మారిందని, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసి రైతులను ముంచుతాం అంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోబోదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం రైతులు పండించిన ప్రతీ గింజను ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేసి సన్న వడ్లకు క్వింటాలుకు రూ2500 ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ శాసనసభ సభ్యురాలు బొడిగ శోభ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్నెబొయిన ఓదెలు, డి. శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కళ్లెం వాసుదేవరెడ్డి, తాళ్ళపెళ్లి శ్రీనివాస్ గౌడ్, బత్తుల లక్ష్మీనారాయణ, జిలా ఉపాధ్యక్షులు మేకల ప్రభాకర్ యాదవ్, ఎర్రబెల్లి సంపత్ రావు, బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా కార్యదర్శులు రాపర్తి ప్రసాద్, బింగి కరుణాకర్, చెపూరి సత్యం, జిల్లా అధికార ప్రతినిధులు బొంతుల కళ్యాణ్ చంద్ర, అలివేలు సమ్మిరెడ్డి, మాసాడి ముత్యం రావు, జానపట్ల స్వామి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజిరెడ్డి, యువమోర్చా జిల్లా అధ్యక్షులు మర్రి సతీష్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు చొప్పరి జయశ్రీ, దళిత మోర్చా అధ్యక్షులు సోమిడి వేణు, ఎస్ టి మోర్చా అధ్యక్షుడు కుర్ర రాజేశం, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, జిల్లా మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా కార్యాలయ కార్యదర్శి మాడుగుల ప్రవీణ్ కుమార్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జెల్ల సుధాకర్, జోనల్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి, అనూప్, నాగసముద్రం ప్రవీణ్, పాదం శివరాజ్, అవుదుర్తి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి వైదుల రామనుజం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *