మంత్రి సొంత జిల్లాలోనే ఇంత దారుణమా
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 6: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ, విష జ్వరాల బారినపడి రోగులు ప్రధాన ఆస్పత్రికి వస్తే, ఇక్కడ కనీస సౌకర్యాలు కరువయ్యాయని బిజెపి నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం రాత్రి ఆయన సందర్శించారు. విష జ్వరాలతో బాధపడుతున్న వారిని పరామర్శించారు.
విష జ్వరాలతో బాధపడుతున్న రోగులు తమకు సరైన వైద్యం అందించడం లేదని, పట్టించుకోవడం లేదంటూ పెద్దిరెడ్డి ఎదుట కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పైకప్పు కూలి ఎప్పుడు కింద పడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వార్డు లోనే 200 మంది జర బాధితులు ఉండడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అంతేకాకుండా ఒకే బాత్రూం ఉండగా, రోగులు అందరూ వినియోగించుకోవడం వల్ల ఆస్పత్రిలో దుర్గంధం వెదజల్లుతోందన్నారు. జ్వర బాధిత వార్డులో ఓకే నర్స్ ఉండడం రోగులకు సరైన వైద్యం అందడం లేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉండడం బాాధాకరమన్నారు. ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కే పరిమితం కాకుండా కరీంనగర్ జిల్లా ఆస్పత్రి సందర్శిస్తే విషయం అర్థమవుతోందన్నారు. పేద ప్రజల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకుంటుందన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించకుంటే ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహిస్తామని పెద్దిరెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, నాయకులు రమణారెడ్డి తోపాటు పలువురు పాల్గొన్నారు.