ఆ లక్ష్యంతోనే….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 30: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదని బిజెపి కిసాన్ మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్ రావు అన్నారు. ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుగుణాకర్ రావు మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా వ్యవసాయ మార్కెట్ సంస్కరణల గురించి అన్ని పార్టీలు అనుకూలంగా ఉండగా, నరేంద్రమోదీ ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణలను చేపడితే టిఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు వ్యతిరేకించడం వారి రాజకీయ సంకుచితత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఈ పార్టీలు తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ మార్కెట్ సంస్కరణలు చేస్తామని హమీలిచ్చి ఇప్పుడు వ్యతిరేకించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అలాంటి అవకాశవాద రాజకీయానికి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక చట్టం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను ఎవరికైనా ఈ దేశంలో ఎక్కడైనా అమ్ముకునే హక్కులను పొందారని, అలాగే పాత వ్యవసాయ మార్కెట్లలో కూడా అమ్మకాలు జరుపుకునే వెసులుబాటు కూడా ఉన్న నేపధ్యంలో కొనుగోలుదారుల్లో పోటి ఏర్పడి రైతులకు లాభం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న కనీస మద్దతు ధరలు అలాగే ఉంటాయని, కనీస మద్దతు ధరలు ఎత్తి వేస్తారనే అబద్ధ ప్రచారాలను నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతు పంటలకు ఎక్కువ ధరలు వస్తే మోదీ, బిజెపి బలపడుతుందనే భయంతో కాంగ్రెస్, టిఆర్ఎస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దళారులకు రక్షణగా నిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతులను ఓట్లు సీట్లు అధికారం కొరకు ఉపయోగించుకుంటున్న కేసీఆర్ వారి ఆర్థిక స్వావలంబనకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. అదే మోదీ ప్రభుత్వం రైతులకు స్వావలంబన, స్వయం సమృద్ధి సగర్వంగా బతికేందుకు చర్యలు చేపడుతుంటే ఈ పార్టీలు విమర్శించడం విడ్డూరంగా ఉందని, ఈ పార్టీలు రైతు పక్షమా…?దళారుల పక్షమా…? అని ప్రశ్నించారు. 2022 నాటికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపై లక్ష్యంగా పనిచేస్తుందని, అలాంటి చర్యలకు తమ సహాయ సహకారాలు అందించాలని ప్రజలకు, రైతులకు సుగుణాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, నగర అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్నెబోయిన ఓదెలు, మాజీ మేయర్ డి శంకర్, జిల్లా నాయకులు హరి కుమార్ గౌడ్, దుర్గం మారుతి, కన్న కృష్ణ, సుజాత రెడ్డి, బిజేవైయం అధ్యక్షుడు బోయినిపల్లి ప్రవీణ్ రావు, మొలుగూరి కిషోర్, దుబాల శ్రీనివాస్, లోకేష్, తమ్మిశెట్టి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.