ఇకనైనా మారండి…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 1: సిర్పూర్ కాగజ్ నగర్ లో మహిళా ఫారెస్ట్ ఆఫీసర్ పై జరిగిన దాడిని నిరసిస్తూ స్థానిక గీతా భవన్ చౌరస్తా లో బిజెపి నగర కార్యదర్శి బండ అనిత ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ శవ యాత్ర నిర్వహించారు. శవ యాత్ర నిర్వహిస్తు నిరసన తెలుపుతున్న మహిళా కార్యకర్తలను టూ టౌన్ పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు గాజుల స్వప్న మాట్లాడుతూ బంగారు తెలంగాణ లో రాష్ట్ర ప్రభుత్వ పాలన నడుస్తుందా ? రజాకార్ల రాజ్యం నడుస్తుందా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులు, ఇతర పార్టీ నాయకులపై టీఆర్ఎస్ నాయకులు గుండాల్లా, రజాకార్లాలా దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ఆసిపాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సారసాల గ్రామంలో మహిళా ఎఫ్ఆర్వోపై స్వయంగా జెడ్పీ వైస్ చైర్మన్ దాడులకు దిగడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మొన్న పాలమూరులో బీజేపీ కార్యకర్తను ఇదే తరహాలో పొట్టన బెట్టుకున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యేపైనా దాడులకు దిగారని వాపోయారు. వరుసగా వెలుగుచూస్తోన్న లైంగికదాడులు, అఘాయిత్యాలతో టీఆర్ఎస్ పాలనలో మహిళలకు, చిన్నారులకు రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు పోలీసుల సమక్షంలోనే నేరుగా మహిళా ఉన్నతాధికారిపైనే దాడులకు తెబడితే.. ఇక సామాన్యులకు రక్షణ కల్పించేదెవరని ప్రశ్నించారు. కార్యాలయా ల్లోనూ మహిళా అధికారులపై అధికార పార్టీ నేతల గుండాగిరి పెరిగిపోయిందని ఆరోపించారు. అసలు అధికార పార్టీకి మహిళంటే మొదటి నుంచి చిన్నచూపే ఉందని మండిపడ్డారు. మహిళా మంత్రి లేకుండా ఐదేళ్లు కాలం వెళ్లదీసింది. ఇపుడు కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. చిన్నారులు, మహిళలపై లైంగికదాడులు వరుసగా వెలుగుచూస్తోన్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు గుండాయిజం పూనుకోవాలని, లేకపోతే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని గాజుల స్వప్న హెచ్చరించారు. బిజెపి నగర ప్రధాన కార్యదర్శి ముప్పిడి సునీల్, మహిళా మోర్చా నగర ప్రధాన కార్యదర్శి మామిడి చైతన్య, మహిళా మోర్చా నాయకురాళ్లు జక్కుల లలిత, మేకల పద్మ, తమ్ముడి మాలతి, కౌసల్య, లక్ష్మి విజయ ,పద్మ. అభి, రామకృష్ణ, ధీరజ్. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.