JMS News Today

For Complete News

ఇక్కడ బిజెపియే ప్రత్యామ్నాయం

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 22: అధికార దాహంతో సామాన్యుల పట్ల, ప్రతిపక్షాల పట్ల ఉన్మాదిలా వ్యవహరిస్తున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యమని బిజెపి  జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ పీకే కృష్ణదాస్ అన్నారు. సోమవారం కరీంనగర్ లోని శివ నరేష్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన పార్టీ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆరు నెలల క్రితం సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ నాలుగు నెలలు తిరగకుండానే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి సగానికి పైగా పార్లమెంటు స్థానాలను కోల్పోయారని విమర్శించారు. దేశంలోని 29 రాష్ట్రాలలో, కేంద్రంలో లేనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఆమోదింపజేసి సామాన్య ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం గుదిబండగా మారిందని  ఆరోపించారు. నాటిన మొక్కలు వాడితే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామన్న కేసీఆర్ తాను నాటిన మొక్కలు వాడిపోయిన విషయం గమనించి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కృష్ణదాస్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని తెలిపారు. గత ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతి కంటే అవినీతి అక్రమ మార్గాల్లో సంపాదించిన వేల కోట్ల రూపాయలతో శాసనసభ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి అధికారానికి వచ్చాడని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో నిరూపితమైన ప్రజా వ్యతిరేకత రానున్న రోజుల్లో మరింత బలపడి బిజెపి విజయానికి నాంది పలుకుతోందని అన్నారు. తెలంగాణలో  కాంగ్రెస్ కనుమరుగైపోయిందని, కమ్యూనిస్టు పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇతర తటస్థ నాయకత్వం బిజెపిలో చేరుతున్నారని తెలిపారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు వేగవంతంగా ముందుకు సాగుతోందని, యువత, మహిళలు, రైతులు, విద్యావంతులు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, అమిత్ షా నేతృత్వంలోని బిజెపి అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు విస్తరించి అటు పార్టీపరంగా, ఇటు ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే దిశగా వృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆయన నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు భాస సత్యనారాయణ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు రాష్ట్ర ఇన్చార్జి ఎం.ధర్మారావు,  రాష్ట్ర సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులు, కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి సుగుణాకర్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టె మురళీకృష్ణ, కన్నబోయిన ఓదెలు,  లింగంపల్లి శంకర్ కొరటాల శివ రామయ్య, గడ్డం నాగరాజు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, చదువు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *