JMS News Today

For Complete News

రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మనమే..

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 17:  తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ నూతన సభ్యత్వాలు, క్రియాశీల సభ్యత్వాల నమోదు పునాదులపైన అధికార ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని సభ్యత్వ పరిశీలకులు కడగంచి రమేష్ అన్నారు. బుధవారం కరీంనగర్ లోని కెమిస్ట్రీ భవన్ లో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ సభ్యత్వ విస్తరక్ ల ప్రశిక్షణ వర్గ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రెండు పార్లమెంటు స్థానాలతో ప్రారంభమైన జన సంఘ్ భారతీయ జనతా పార్టీల ప్రస్తానం 303 స్థానాలతో సుస్థిరమైన ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, అందుకు బిజెపికి లభించిన లక్షలాదిమంది సుశిక్షితులైన కార్యకర్తల గణమే కారణమని అన్నారు. ప్రపంచంలో ప్రతి భారతీయుడు గర్వించేలా స్వాభిమాన పాలన అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి పార్టీలో చేరేందుకు వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువకులు, రైతులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రతి ఓటరును పార్టీలో సభ్యులుగా చేర్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు. దేశంలో 20 రాష్ట్రాలకు పైగా ప్రభుత్వాలకు నేతృత్వం వహిస్తున్న బిజెపి కమ్యూనిస్టు కంచుకోటలైన పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని, అదే స్పూర్తితో దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ అధికార శక్తిగా ఎదిగేందుకు పోరాటాలు నిర్వహించాలని  పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగైపోయాయని, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు స్థానం లేకుండా పోయిందని, ఆయా పార్టీల నేతలంతా ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ అరాచక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల నాటికి బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి ఉందన్న వాస్తవ విశ్వాసం ప్రజల్లో వ్యక్తమవుతుందని, విశ్వాసానికి అనుగుణంగా కార్యకర్తలంతా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అవినీతికి, వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఆందోళనలు, పోరాటాలు నిర్వహించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో కెసిఆర్ ప్రభుత్వం పై, ఆయన పాలన పై ప్రజా వ్యతిరేకత స్పష్టమైందని, బిజెపి పార్టీ పై ప్రజలు చూపిన ఆదరణతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని గెలిపించాలని, అందుకు ప్రతి కార్యకర్త ఎన్నికల నాటికి నిరంతరంగ శ్రమించాలన్నారు. కరీంనగర్ జిల్లాలో బీజేపీకి ఆదరణ లభిస్తోందని, అందుకు తగ్గట్టుగా పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు, క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. నిండు కుండ లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఖజానా ఖాళీ చేసి అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కెసిఆర్ కు దక్కుతుందని, రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చి కేవలం తన కుటుంబ అధికారం కోసమే ఫామ్ హౌస్ లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడని కెసిఆర్ ను విమర్శించారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ ఆయన మంత్రివర్గ సహచరులు చేసిన అవినీతిపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఉద్యమాలు నిర్వహిస్తుందని రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టె మురళీకృష్ణ, పార్లమెంటు కన్వీనర్ చదువు రాజేందర్, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, నగర అధ్యక్షులు బేతి మహేందర్ రెడ్డి, ఓ బి సి మోర్చా రాష్ట్ర కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షురాలు గాజుల స్వప్న, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రాపర్తి విజయ, మండల అధ్యక్షులు రమణారెడ్డి, శేఖర్ కరీంనగర్ నియోజకవర్గంలోని బిజెపి శక్తి కేంద్రాల ఇన్ ఛార్జ్ లు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *