JMS News Today

For Complete News

72గంటల్లో పరిష్కరించాం…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 31: కరీంనగర్ ఎంపీగా బీజేపీ నేతలు గెలిచిన ప్రతిసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. హైదరాబాద్ విలీన బాధ్యత సర్దార్ వల్లభాయ్ పటేల్ కాకుండా నెహ్రూ తీసుకుని ఉంటే ఇక్కడ కూడా 370వ అధికరణం వచ్చేదని, ఈ విషయంలో తెలంగాణ ప్రజలు అదృష్టవంతులని పేర్కొన్నారు. కరీంనగర్ లోని పద్మనాయక కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 370 ఆధికరణ రద్దుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొద్దిమంది మాత్రం అజ్ఙానంతో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. 72 ఏళ్ల సమస్యను 72 గంటల్లో పరిష్కరించామని, ఈ ఆర్టికల్ రద్దు చేయాలని బాల్యం నుంచి పోరాడి వృద్ధులైన వారున్నారని గుర్తు చేశారు. వాళ్ళందరినీ త్వరలో సన్మానిస్తామని తెలిపారు. దృఢమైన మోడీ నాయకత్వం లభించడం వల్లే ఈ సమస్య పరిష్కారమైందని చెప్పారు. దేశం కోసం రాసుకున్న రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్ కు 2 ఆర్టికల్స్ వర్తించలేదని, ప్రాథమిక హక్కులుండే పార్ట్-3 కూడా అక్కడి ప్రజలకు వర్తించలేదని వివరించారు. కేంద్రంలో 70 రోజుల్లో ఆర్టికల్ 370, త్రిబుల్ తలాఖ్ రద్దు చేస్తే..తెలంగాణ, ఆంధ్రాలో మాత్రం అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. 35ఎ ఆర్టికల్ ద్వారా ప్రాథమిక హక్కులు కేవలం జమ్ము, కాశ్మీర్ కు మాత్రమే వర్తిస్తాయని, దేశంలో ఎక్కడి వారైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఉన్నా, జమ్మూ కాశ్మీర్ లో చేసుకునే వీలుండేది కాదని తెలిపారు. జాతీయ జెండాతో సమానంగా కాశ్మీర్ జెండా ఎగరాలని రూలుండేదని, రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాల పద్ధతితో అక్కడి ప్రజలు అవస్థలు పడ్డారని అన్నారు. దీని వల్ల కొందరే లాభ పడ్డారని తెలిపారు. పాకిస్థాన్ నుంచి ఇండియాకి శరణార్థులుగా వచ్చిన వారు దేశ ప్రధానులయ్యారని, 70 ఏళ్లుగా కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం బీజేపీ పోరాడటంతో కొంత కాలం క్రితమే రిజర్వేషన్ వచ్చిందని, ఇతర ప్రాంతాల నుంచి జమ్మూ కాశ్మీర్ కు వెళ్లిన వారికి ఎలాంటి ప్రాథమిక హక్కులుండేవి కావని చెప్పారు. కనీసం అక్కడి రాష్ట్ర ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదని, అక్కడ మహిళలందరికీ తాను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ లేదని, కేవలం అక్కడి వారినే చేసుకోవాలని, లేదంటే పౌరసత్వం రద్దయ్యేదని వివరించారు. మగవాళ్లకు మాత్రం ఈ నిబంధన చెల్లదని, ఇలాంటి ఆర్టికల్ తీసేస్తే రాద్ధాంతం ఎందుకు?
అక్కడి ప్రజలను అడగకుండా తీసేసారంటున్న వాళ్లు..అసలు ఎవరినడిగి తెచ్చారని ప్రశ్నించారు. ఈ ఆర్టికల్ ప్రవేశ పెట్టేటప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఇద్దరు తప్ప అందరూ వ్యతిరేకించారని, అందరూ వ్యతిరేకించినా నెహ్రూ వల్లే ఈ ఆర్టికల్ వచ్చిందని ఆరోపించారు. కాశ్మీర్ లోని కొందరి రాజకీయ అవసరాలకు మాత్రమే ఇది ఉపయోగపడిందని, అక్కడి ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. అక్కడి ప్రజలు తాము ఇంతకాలం మోసపోయామని అర్థం చేసుకుంటున్నారని, ఐదేళ్లలో 90 వేల కోట్ల ఆర్థిక సహాయం ఆ రాష్ట్రానికి అందించామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల డిగ్నిటీ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, జమ్మూ కాశ్మీర్ ను పాకిస్థాన్ కోణంలో చూడొద్దని, అది మనదని తెలిపారు. పాకిస్థాన్ ను ఎలా కంట్రోల్ చేయాలో మనకు తెలుసని, అక్కడి ప్రజల రాజకీయ అధికారాలు, అభివృద్ధి, ప్రజలకు డిగ్నిటీ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జమ్ము కాశ్మీర్ భూభాగం మాత్రమే కాదు అక్కడి ప్రజలు కూడా మనవాళ్లేనని, వాళ్లను మనం ఆలింగనం చేసుకోవాలని అన్నారు. సెలవుల్లో మనందరం అక్కడికి విహార యాత్రలకు వెళ్ళాలని,
అక్కడ సామాన్య పరిస్థితులు మెరుగు పడడానికి ప్రజలందరూ సహకరించాలని రాంమాధవ్ కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, నేతలు మధుసూదన్ రావు, బొడిగె శోభ, విద్యా సంస్థల నుంచి నరేందర్ రెడ్డి, డాక్టర్ గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *