JMS News Today

For Complete News

ఆ ఎంపీ దాతృత్వం…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 11: బీజేపీ రాష్ట్ర రథ సారధి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ తన పుట్టిన రోజును పురస్కరించుకుని తన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన రూ.3 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఆదివారం అందజేశారు. వీటిలో 4 అంబులెన్సులతోపాటు పెద్ద సంఖ్యలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్లు, వెంటిలేటర్లు, సీపాప్ మెషీన్, అనెస్తెషియా, సీటీజీ, ల్యాప్రోస్కోప్, ఫీటల్ డాప్లర్, బయోకెమిస్ట్రీ, కోవిడ్ ప్రొఫైల్ మెషన్లు ఉన్నాయి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జిల్లా ప్రధాన ఆసుపత్రితో పాటు వేములవాడ, సిరిసిల్ల, హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రులకు ఈ అంబులెన్సులను అందజేశారు. ఐసీయూలో ఉండాల్సిన పరికరాలన్నీ ఈ అంబులెన్సులలో సమకూర్చడం విశేషం. పార్లమెంట్ పరిధిలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు ఫెటల్ డాప్లర్ లను, బయోకెమిస్ట్రీ, కోవిడ్ ప్రొఫైల్ సిరంజ్, ఇంఫుజిన్ పంప్స్, సిరంజి పంప్స్, సీపాప్, హెస్టెరోస్కోప్ విత్ హైడ్రోజెట్ మెషిన్లతో పాటు వెంటిలేటర్స్ ను అందజేశారు. కోవిడ్ వల్ల ఎవరూ ఆక్సిజన్ కు ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో అవసరమైన వారందరికీ తన ఎంపీ కార్యాలయంలో ఆక్సిజన్ కాన్సట్రేటర్స్, మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. అవసరమైన వారికి వీటన్నిటినీ ఉచితంగా అందజేస్తామని తెలిపారు. రాబోయే రెండు నెలల్లో పార్లమెంట్ పరిధిలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గ ఆసుపత్రులకూ అంబులెన్సులను అందజేస్తామని సంజయ్ ప్రకటించారు. మరోవైపు తన పుట్టిన రోజును పురస్కరించుకుని కార్యకర్తలకు భరోసా కల్పించే మహత్కార్యానికి కూడా శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కష్టపడి పనిచేసే 5వేల మంది బీజేపీ కార్యకర్తలు, యువకులకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. పుట్టిన రోజు నాడే వెయ్యి మంది కార్యకర్తలకు సంబంధించి బీమా ప్రీమియం చెల్లించినట్లు వివరించారు. మరికొద్ది రోజుల్లో మిగిలిన వారందరి జాబితా సేకరించి ప్రీమియం చెల్లిస్తున్నట్లు తెలిపారు. తాను ఎంపీగా కొనసాగినంత కాలం కార్యకర్తల ఈ బీమా ప్రీమియాన్ని తానే చెల్లిస్తానని ప్రకటించారు. కాగా, సంజయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రం నలమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర నాయకులతో పాటు వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు కరీంనగర్ తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వారందరినీ ఉద్దేశించి మాట్లాడిన సంజయ్ తన జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు తన పుట్టిన రోజున సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తన స్నేహితులు, బంధుమిత్రుల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రులకు 4 అంబులెన్నులతో పాటు వైద్య పరికరాలు సమకూర్చినట్లు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో బీజేపీ కార్యకర్తలు ‘సేవాహీ సంఘటన్’ పేరిట చేస్తున్న సేవలను ఈ సందర్భంగా సంజయ్ మరోమారు కొనియాడారు. బాధితులను ఆదుకునే క్రమంలో ఎంతోమంది కార్యకర్తలను పోగొట్టుకోవాల్సి వచ్చిందన్నారు.
అంతకుముందు సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి మహాశక్తి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో స్థానిక బీజేపీ కార్పొరేటర్లతో కలిసి మొక్కలు నాటారు. సంజయ్ ని కలిసి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, బొడిగె శోభ, కొండేటి శ్రీధర్, జడ్పీ మాజీ ఛైర్మన్ తుల ఉమ, బీజేపీ రాష్ట్ర నాయకులు కొల్లి మాధవి, సంగప్ప, ఉమారాణి, ఎన్వి సుభాష్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆశిష్ గౌడ్, రాష్ట్ర బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ వెంకటరమణ, లంకల దీపక్ రెడ్డి, వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, రావు పద్మ, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, జిహెచ్ఎంసి & కరీంనగర్ కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *