JMS News Today

For Complete News

వర్శిటీకి 12-బి హోదా ఇవ్వండి…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల స్వతంత్రతను దెబ్బతీసేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతి లేనిదే విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి నియామకాలు చేపట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అందులో భాగమేనని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఉంటుందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించచడం లేదని, దీనివల్ల భవిష్యత్తులో విశ్వవిద్యాలయాల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. శుక్రవారం బండి సంజయ్ న్యూఢిల్లీలో యూజీసీ కార్యదర్శి, సీవీవో రజ్నీష్ జైన్ ను కలిశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని శాతవాహన యూనివర్శిటీకి 12-బి హోదాను కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. శాతవాహన యూనివర్శిటీకి 12(బి) హోదా లేకపోవడంతో, యూనివర్శిటీలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విశ్వవిద్యాలయానికి కావాల్సిన నిధులు సమకూరడం లేదని పేర్కొన్నారు. మారిన నిబంధనలతో యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని, అందుకోసం వీలైనంత త్వరగా 12-బి హొదా కల్పిస్తే శాతవాహన యూనివర్సిటీలో నెలకొన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయని వివరించారు. శాతవాహన వర్శిటీకి 12-బి హోదా కల్పించే విషయంలో గతంలో చేసిన తన వినతి మేరకు ప్రత్యేకంగా కమిటీని నియమించడం పట్ల యూజీసీ కార్యదర్శి రజ్నీష్ జైన్ కు ధన్యవాదాలు తెలిపిన బండి సంజయ్ కుమార్, ఆ కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిటీని ప్రభావితం చేయకుండా వెంటనే యూనివర్శిటీకి 12-బి హోదా ఇవ్వాలని కోరారు. ఒకవేళ యూనివర్శిటీలో ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే వాటిని సరిదిద్ధుకుని యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బండి సంజయ్ వినతిపట్ల సానుకూలంగా స్పందించిన రజ్నీష్ జైన్ వెంటనే రికగ్నిషన్ కమిటీ ఛైర్మన్ తో ఫోన్ లో మాట్లాడారు. శాతవాహన వర్శిటీకి 12-బి హోదా ఇచ్చే విషయంపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రికగ్నిషన్ కమిటీ నివేదిక అందిన వెంటనే శాతవాహన వర్శిటీకి 12-బి స్టేటస్ కల్పిస్తామని బండి సంజయ్ కు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ యూజీసీ కార్యదర్శి, సీవీవో రజ్నీస్ చైన్ కు ధన్యవాదాలు తెలిపారు. యూజీసీ సెక్రటరీ, సీవోవో రజ్నీస్ జైన్ తో భేటీ అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీకి 12(బి) స్టేటస్ లభించినట్లయితే అధ్యాపక, బోధనేతర సిబ్బంది నియామకాల్లో సమస్యలు తొలగిపోతాయని తెలిపారు. అంతేకాకుండా యూనివర్సిటీకి అవసరమైన నిధులు సమకూరుతాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *