ప్రభుత్వ అవినీతిపై రాజకీయ పోరు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 17: తెలంగాణ ఏర్పడ్డాక అంతా అవినీతి మయమైపోయిందని, రాష్ట్రంలో 74 శాతం మంది డబ్బులిచ్చి పనులు చేయించుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. శనివారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై రాజకీయ పోరాటం చేస్తామని, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని స్పష్టం చేశారు. సర్పంచుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబ పాలనకు స్వస్తి పలికే పార్టీలు, వ్యక్తులను కలుపుకొని ముందుకు పోతామని, తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడేవరకు విశ్రమించేది లేదని అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, చివరకు చదువును కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవ వేడుకలను జరిపి తీరుతామని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టి బిజెపికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం జగిత్యాల కు చెందిన డాక్టర్ గౌరీశంకర్ కు పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు.