ఆయన కీలక నిర్ణయం…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే కామ్)
హైదరాబాద్, జూలై 10: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని, ధరణి పోర్టల్ లోని లోపాలను సరిదిద్ది రైతులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో సోమవారం ‘మౌనదీక్ష’ పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వరలక్ష్మీ గార్డెన్స్ లో సోమవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరపతలపెట్టిన ఈ ‘మౌనదీక్ష’లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్ తన పుట్టిన రోజు సందర్భంగా రైతుల కోసం మౌనంగా ఉంటూ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నుంచి బర్త్ డే శుభాకాంక్షలు స్వీకరించనున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా తమ తమ ప్రాంతాల్లో ‘మౌనదీక్ష’కు సంఘీభావం తెలపనున్నారు.