సమయమిచ్చి ఉంటే…..!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, డిసెంబర్ 5: ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే మరో 20 నుంచి 25సీట్లు గెలిచే వాళ్ళమని, అలాగే ఎన్నికలకు తగిన సమయమిచ్చి ఉంటే 100సీట్లు గెలిచే వాళ్ళమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఆదరాబాదరాగా ఎన్నికలు నిర్వహించిన భాగ్యనగర్ ప్రజలు బిజెపికి అండగా నిలిచి 48 సీట్లు అందించారని తెలిపారు. శనివారం సాయంత్రం సంజయ్ మీడియాతో మాట్లాడారు. మజ్లిస్ పాతబస్తీకే పరిమితమైందని, అక్కడ కూడా లేకుండా చేస్తామని అన్నారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని గెలిచిన కార్పోరేటర్లతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకుంటామని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల అనంతరం అభివృద్ధే మా లక్ష్యమని, అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే, అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల నాటికి బిజెపి బలమైన శక్తిగా ఎదిగి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.