JMS News Today

For Complete News

కేంద్ర సాయంతోనే…రాష్ట్రంలో…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 15: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించిన సాయంతోనే కరోనా నివారణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి 7151 కోట్ల రూపాయల నిధులను కరోనా నివారణ చర్యలకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని, ఈ నిధులతో 7 లక్షల 44 వేల ఎన్ 95 మాస్కులు అందుతున్నట్లు, 3 లక్షల 41 వేల పిపిఇ కిట్లు, 22 లక్షల 50 వేల హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు, అలాగే 3 లక్షల 82 వేల పరీక్షల పరికరాలు మంజూరు చేసినట్లు బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన స్వయంగా కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో సందర్శించారు. అనంతరం కరీంనగర్ లో కీలక వ్యాపార ప్రాంతమైన టవర్ సర్కిల్ లో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ తో కలిసి పర్యటించారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంకతో సుమారు రెండు గంటలపాటు కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యల పట్ల విస్తృతంగా సమీక్షించారు. కరీంనగర్ జిల్లాలో డివిజన్ల వారీగా గ్రామాల వారిగా ప్రాంతాల వారిగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలను హెల్త్ బులిటెన్ లో వివరించాలని, టెస్టుల సంఖ్య పెంచాలని కలెక్టర్కు సూచించారు. కరీంనగర్ జిల్లాలో అందుబాటులో ఉన్న రెండు ప్రైవేటు మెడికల్ కాలేజ్ లను కరోనా చికిత్సలకు అందుబాటులో అలాగే శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులో సౌకర్యాలు మెరుగుపరచాలని, హోమ్ క్వారంటైన్ లో ఉన్న కేసులను గుర్తించి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ను కోరారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కి కేంద్రం అందించిన 24 వెంటిలేటర్లు అదనంగా పడకలు ఈ క్లిష్టమైన సమయంలో ఉపయోగంలోకి రావడం విశేషమని కలెక్టర్ శశాంక ఎంపీ బండి సంజయ్ కుమార్ వివరించారు.

ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డు సందర్శిన

కరీంనగర్ జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభించడంతో ప్రధాన ఆసుపత్రిలో చేస్తున్న కరోనా పరీక్షలను ఐసోలేషన్ వార్డులో అందుతున్న చికిత్సలను పరిశీలించేందుకు బండి సంజయ్ కుమార్ ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. కరోనా తీవ్రత సమయంలో సాహసించి ఐసోలేషన్ వార్డులో రోగులను పరామర్శించి వారికి అందుతున్న చికిత్స వివరాలు ఎంపీ బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు! ఆస్పత్రిలో సుమారు గంటన్నరపాటు కలియతిరిగారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనుల పట్ల అందించే భోజనం పట్ల ఫిర్యాదులు అందాయని ఆ ఫిర్యాదుల పట్ల వెంటనే చర్యలు తీసుకొని మళ్లీ ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆస్పత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులకు మరియు సిబ్బందికి ఎంపీ బండి సంజయ్ కుమార్ స్వయంగా ఐదు వందల 500 పీపీఇ కిట్లు అందజేశారు. కరోనా పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వ్యక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించి జాగ్రత్తలు వివరించాలని వైద్య సిబ్బందికి డాక్టర్లకు ఆస్పత్రి అధికారులకు సూచించారు.

భారీ వర్షంలోనూ క్లాక్ టవర్ ప్రాంతంలోనూ పర్యటన

కరోనా విజృంభిస్తున్న సమయంలో కరీంనగర్లోని క్లాక్ టవర్ ప్రాంతంలో తప్పుడు ప్రచారాలతో భయబ్రాంతులకు గురి చేస్తున్న విషయాన్ని ఎంపీ బండి సంజయ్ దృష్టికి కొంతమంది తీసుకురావడంతో ఆ ప్రాంతాన్ని పర్యటించారు. జరుగుతున్న తప్పుడు సమాచారంతో క్లాక్ టవర్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ సమయంలో అక్కడి ప్రజల్లో వ్యాపార సముదాయంలో మనోధైర్యాన్ని నింపేందుకు మునిసిపల్ కమిషనర్ క్రాంతి మరియు కార్పొరేటర్ లతో కలిసి పర్యటించారు. వ్యక్తిగత జాగ్రత్తలు సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా వ్యాధిని అరికట్టవచ్చని వివరించారు. ఈ ప్రాంతానికి జిల్లా ప్రజలతో సంబంధాలు ఉండడంతో కొంతమంది ఆకతాయిలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వ్యాపారులు ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దని భరోసా కల్పించారు క్లాక్ టవర్ ప్రాంతంలో ఎంపీ బండి సంజయ్ చేసిన భరోసా పర్యటన ఆ ప్రాంతంలోని వ్యాపారులకు అక్కడి ప్రజలకు మరో ధైర్యాన్ని కల్పించింది.

1 thought on “కేంద్ర సాయంతోనే…రాష్ట్రంలో…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *