సామాన్య భక్తుల కోసమే…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
తిరుమల, జూలై 12: ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలకు దేశ, విదేశాల నుండి ఎంతో మంది వస్తుంటారు. అయితే, వీఐపీల దర్శన సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా పండుగలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతరత్రా రోజుల్లో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది. దీంతో సామాన్య భక్తుల దర్శన విషయంలో మార్పులు చేర్పులు చేస్తుంటారు టీటీడీ అధికారులు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీటీడీపై దృష్టి సారించింది. సామాన్యుడికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీలకు ఇస్తున్న ఎల్-1, ఎల్-2, ఎల్-3 బ్రేక్ దర్శనాల టికెట్లను త్వరలో రద్దు చేస్తామని సుబ్బారెడ్డి ప్రకటించారు. స్థానిక బర్డ్ ఆస్పత్రిని శనివారం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విఐపిలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే రావాలని సూచించారు. పదేపదే విఐపిలు దర్శనాలకు వస్తే సామాన్య భక్తులు ఇబ్బంది పడతారన్నారు. మరో పది రోజుల్లో టిటిడి పాలకమండలి సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి స్థాయిలో నియమిస్తారని తెలిపారు. శ్రీవారి సేవకు వచ్చి చనిపోతే టిటిడి తరఫున ఆర్థిక సహాయం ఇచ్చే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయన వెంట తుడా చైర్మన్ డాక్టరు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బర్డ్ ఆస్పత్రి ఇన్‌ఛార్జి డైరెక్టర్ డాక్టరు వెంకారెడ్డి ఉన్నారు.