మంత్రి సొంత జిల్లాలో..ఇలానా…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 31: కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని శనివారం కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు బట్టివిక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, డీసీసీ ప్రెసిడెంట్ కటకం మృత్యుంజయం తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు. గత ప్రభుత్వాల ఏర్పాటు చేసిన బెడ్లపై బెడ్ షీట్లు కూడా వేయని పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. నిరుపేదలు విష జ్వరాలతో బాధపడుతుంటే కావాల్సిన మందులు కూడా లేవని, 500 బెడెడ్ ఆస్పత్రిలో 250 బెడ్లకు కూడా సరిపడా సిబ్బంది లేరని విమర్శించారు. బెడ్స్ సరిపోక మడత మంచాలు వేసి ట్రీట్ మెంట్ ఇస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ట్రీట్ మెంట్ చేయాల్సిన మహిళా సిబ్బందిలేక మగవాళ్లతో వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు. సొంత జిల్లాలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సరైన పర్యవేక్షణ చేయలేకపోవడం బాధాకరమన్నారు. మీ పార్టీతో మీకున్న విబేధాలు ప్రజలపై పడనీయకండని సూచించారు. వైద్య పరీక్షల విభాగాలు సరిగా పనిచేయడం లేదని తెలిపారు. గ్రామాల్లో శానిటేషన్ లోపించి రోగాలు ప్రబలుతున్నాయని, కావాల్సినంత సిబ్బందిని, డాక్టర్లను నియమించి సౌకర్యాలు కల్పించాలని విక్రమార్క డిమాండ్ చేశారు.