ముగ్గురు ఎంపీలు ఏం చేశారంటే…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
ఢిల్లీ, మార్చి 3: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఇజీఎస్) నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్, సోయం బాబురావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వాటా కింద వచ్చిన నిధుల కేటాయింపు సరిగా లేదని, తమ నియోజకవర్గాల పరిధిలో సిమెంట్, కాంక్రీట్ రోడ్లకు నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ముగ్గురు బిజెపి ఎంపీలు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రజాప్రతినిధులు ఉన్న చోట కాంక్రీట్ రోడ్లు, సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు నిధులు ఇవ్వకుండా రాష్ట్ర సర్కారు పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కావాలనే, ఉద్దేశపూర్వకంగానే నిధుల కేటాయింపులో ఆలస్యం చేస్తున్నారని, అధికారుల మీద ఒత్తిడి తెస్తూ పనులు అడ్డుకుంటున్నారని వీరు మండిపడ్డారు.
బీజేపీ ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిచోటా ఇదే పరిస్థితి అని కరీంనగర్ ఎంపీ సంజయ్ మంత్రి తోమర్ దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు ఎంపీలు కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. ఎంజీఎన్ఆర్ఇజీఎస్ నిధుల కేటాయింపు సక్రమంగా జరిగేలా చూడాలని ఎంపీలు కోరారు.