మరికొన్ని గంటల్లో..జాబిలమ్మ చెంతకు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
నెల్లూరు, జూలై 22: మరికొన్ని గంటల్లో అందాల జాబిలి అమ్మ చెంతకు వెళ్ళేందుకు చంద్రయాన్-2 సిద్ధమైంది. ఈ మేరకు ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎ్సఎల్వీ మార్క్3ఎం1 రాకెట్ ద్వారా రివ్వున జాబిల్లి వైపు దూసుకెళ్లనుంది. సాంకేతిక లోపాన్ని అధిగమించిన తర్వాత రిహార్సల్ కూడా విజయవంతం కావడంతో ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన సంగతి తెలిసిందేే. బాహుబలిగా పేర్కొనే జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 రాకెట్ బరువు 640 టన్నులు. 3,877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్-2 కంపోజిట్ మాడ్యూల్తో ఈ రాకెట్ పయనిస్తుంది. చందమామ చెంతకు వెళ్లేందుకు రాకెట్ సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 15వ తేదీన 56 నిమిషాల ముందు సాంకేతిక లోపం తలెత్తి చంద్రయాన్-2 ప్రయోగం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ లోపాన్ని సరిచేసిన తర్వాత వారం రోజులకే దానిని తిరిగి ప్రయోగానికి సన్నద్ధం చేశారు. ఈ ప్రయోగంలో బాహుబలి రాకెట్ ప్రయాణం 16.31 నిమిషాలే ఉంటుంది. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత చంద్రయాన్-2 మాడ్యూల్‌ను రోదసిలో వదిలి పెడుతుంది. ఇలా భూమికి 170.06 కి.మీ. దగ్గరగా, 39.120 కి.మీ. దూరంగా ఉండే దీర్ఘ వృత్తాకారపు భూ కక్ష్యలోకి చంద్రయాన్ మాడ్యూల్ చేరుకున్న వెంటనే కర్ణాటక బైలాలులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం దానిని తన అధీనంలోకి తీసుకోనుంది. కాగా, ఈ ప్రయోగం పై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలంతా సవాల్‌గా తీసుకున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆదివారం సాయంత్రం షార్కు చేరుకుని శాస్త్రవేత్తలతో సమీక్షించారు. ‘15న గుర్తించిన సాంకేతిక లోపాన్ని సరిచేశాం. ప్రయోగానికి రాకెట్ పూర్తి సన్నద్ధతో ఉంది. రిహార్సల్ విజయవంతంగా పూర్తయ్యింది. చంద్రయాన్-1 ద్వారా జాబిల్లిపై నీటి జాడలు తెలియడంతో.. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ చంద్రయాన్-2 ఆకర్షిస్తోంది.