సినీ నటుడు గొల్లపూడి ఇక లేరు…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
చెన్నై, డిసెంబర్ 12: టాలీవుడ్ లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీ రావు (80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ కొద్ది సేపటికి క్రితం తుదిశ్వాస విడిచారు. 250కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. సినిమాల్లోకి రాకముందు ఆయన నాటకాలు, కథలు, నవలలు రాసేవారు. మారుతీరావు 1939, ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. ఒక రంగంలో రాణించడమే కష్టమైన ఈ రోజుల్లో ఎన్నో రంగాల్లో పరిపూర్ణత సాధించిన బహు కళాప్రపూర్ణుడు గొల్లపూడి మారుతీ రావు. ఈయన విలక్షణ నటుడు, ప్రతి నాయకుడు, రచయిత, కవి, జర్నలిస్టు, ప్రసంగీకుడు. ఇలా పలు రంగాల్లో రాణించిన గొల్లపూడికి ఐదు సార్లు నంది అవార్డులు వరించాయి.1963లో డాక్టర్ చక్రవర్తి సినిమాకు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిగా, 1965లో ఆత్మగౌరవం అనే సినిమాకి ఉత్తమ రచయితగా, 1989లో కళ్ళు అనే రచన సినిమాగా వచ్చింది. దీనికి ఉత్తమ రచయితగా, 1991లో మాస్టారి కాపురం సినిమాకు గానూ ఉత్తమ సంభాషణల రచయితగా మారుతీ రావు నంది అవార్డులు అందుకున్నారు. అప్పాజోశ్యుల విష్ణుభట్ల ఫౌండేషన్ జీవన సాఫల్య అవార్డు, గురజాడ అప్పారావు, పురస్కారం, పులికంటి కృష్ణా రెడ్డి పురస్కారం, ఆత్రేయ స్మారక పురస్కారం, రాజ్యలక్ష్మి అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు, వంశీ బర్కిలీ అవార్డు, శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి అవార్డు, కొండముది శ్రీరామ చంద్రమూర్తి అవార్డు, లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు ఇలా ఎన్నో అవార్డులు గొల్లపూడి అందుకున్నారు. కాగా, ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, సీనీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.