వేణుమాధవ్ కన్నుమూత
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, సెప్టెంబర్ 25: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్ను మూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికి క్రితం వేణుమాధవ్ తుది శ్వాస విడిచారు. మిమిక్రీ కళాకారుడిగా కెరీర్‌ను ప్రారంభించిన వేణుమాధవ్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘సంప్రదాయం’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలతో అలరించి ప్రేక్షకులను మెప్పించారు. అదే సమయంలో పవన్‌కల్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రం వేణుమాధవ్‌కు ఎంతో గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న కమెడియన్లలో ఆయన ఒకరిగా నిలిచారు. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రంతో పరిచయమైన వేణుమాధవ్ మళ్లీ ఆయన దర్శకత్వంలోనే ‘హంగామా’తో కథానాయకుడిగా మారారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని కథానాయకులందరితోనూ ఆయన నటించారు.