కొబ్బరికాయ కొట్టిన సీఎం కేసీఆర్…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 27: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నూతన సచివాలయం భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనం స్థానంలోనే కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సచివాలయం డి-బ్లాక్ వెనుక భాగంలోని తోటలో కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీచైర్మన్లతో కలిసి కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్ తొలుత భూమిపూజ చేశారు. అనంతరం పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టారు. హారతి అనంతరం ఆత్మ ప్రదక్షిణ చేసి శంకుస్థాపన గోతిలో పూజాద్రవ్యాలు వేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత రూ.100 కోట్ల వ్యయంతో ఎర్రమంజిల్ లో నిర్మించ తలపెట్టిన నూతన అసెంబ్లీ భవనానికి శంకుస్థాపన చేసేందుకు వెళ్లారు. 30 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయం, 17.9 ఎకరాల విస్తీర్ణంలో అసెంబ్లీ భవనాలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే. ఈ కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేటలోని ప్రగతిభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లకు సీఎం కేసీఆర్ విందు ఇస్తారు. ఇప్పటికే రూ.400 కోట్లతో నూతన సచివాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సచివాలయం భవన నమూనాను కూడా మీడియాకు విడుదల చేశారు. అధికారులతో సమీక్షలకు వీలుగా కాన్ఫరెన్స్ హాల్‌తోపాటు, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను ముఖ్యమంత్రి సచివాలయంలోనే నిర్వహించేలా నిర్మాణాలు రాబోతున్నాయి. దాదాపు ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే కొత్త సచివాలయంలో మంత్రులు, సంబంధిత శాఖల కార్యదర్శులు, సెక్షన్లు అన్నీ ఒకేచోట వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. కొత్త సచివాలయాన్ని చరిత్రలో నిలిచిపోయేలా, అన్ని సౌకర్యాలతో పూర్తి వాస్తు ప్రకారం నిర్మించనున్నారు. సచివాలయ కార్యాలయాలను ఎక్కడకు తరలించాలనే విషయంపై క్యాబినెట్ సబ్‌కమిటీ అన్నింటినీ పరిశీలించి, నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా తరలింపు ప్రక్రియ చేపడుతారు. కాగా, సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలు తలపెట్టాయి. దీంతో గురువారం ఉదయం నుండి విపక్ష నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరో వైపు హబ్సిగూడలోని ఓ హోటల్ లో బిజెపి నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. సచివాలయం వద్ద నిరసన చేపట్టేందుకు బిజెపి నేతలు సిద్ధమవుతున్నారు.