సీఎం ప్రసంగంపై ఆసక్తి…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, అక్టోబర్ 17: హుజూర్ నగర్ ఉప ఎన్నికల బహిరంగ సభలో ఇవాళ పాల్గొంటున్న సీఎం కేసీఆర్ ప్రసంగంపై ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపు తోంది. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు ఉదృతమవుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సమీక్షలు, పత్రిక ప్రకటనలు మినహాయిస్తే…సమ్మెపై సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఇప్పటివరకు సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని అధికారులకు వివరిస్తూ వస్తున్న ఇవాళ కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికల బహిరంగ సభ ద్వారా తొలిసారి సమ్మె విషయంలో ప్రజలకు వివరణ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ఎన్నికల ప్రసంగం ఏలా ఉండబోతోందన్న విషయం అక్కడి ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరిలో ఆసక్తి రేపు తోంది. ఈ నెల 21న ఉప ఎన్నిక జరగనున్న హుజూర్నగర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రచారం నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ నాయకులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హుజూర్నగర్ గుట్ట సమీపంలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి తరపున స్వయంగా ప్రచారానికి దిగడం గమనార్హం. మధ్యాహ్నం 12:30 గంటలకు కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి హెలికాప్టర్లో హుజూర్నగర్ చేరుకుంటారు. బహిరంగ సభ అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. అనంతరం రాత్రి అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, కేసీఆర్ ఆరున్నర నెలల తర్వాత మళ్లీ ప్రచార బరిలోకి దిగుతున్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ చివరిసారి ఏప్రిల్ 8న వికారాబాద్లో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా, ఆర్టీసీ సమ్మె పై కేసిఆర్ మాట్లాడుతారా? నియోజకవర్గ సమస్యలనే ప్రస్తావిస్తారా? ఒకవేళ నియోజకవర్గ సమస్యలకే పరిమితం అయితే, పార్టీకి ప్రయోజనం ఉండదనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది. అయితే, ఏలాంటి ప్రతికూలతలనైనా తనకు అనుకూలంగా మార్చుకునే సత్తా కలిగిన సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికల బహిరంగ సభ ప్రసంగంపై ఇప్పుడు అందరిలో ఉత్కంఠ, ఆసక్తి రేపు తోంది. మరీ కేసీఆర్ ప్రసంగం ఏలా ఉండబోతోందో మరికొన్ని గంటల్లో తేలనుండగా, అప్పటి వరకు వేచి చూడాల్సిందే.