JMS News Today

For Complete News

ఇలాగే అంటే..ఫ్రీ కరోనా…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, మార్చి 29: రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 70 ఉన్నాయని, వారిలో ఒకరిని డిశ్చార్జ్ చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ 11 మంది కరోనా పాజిటివ్ కేసుల రిజల్ట్ నెగటివ్ వచ్చిందని, వాళ్ళని 30వ తేదీన డిశ్చార్జ్ చేస్తామని, ఇంకా కొన్ని పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మిగిలిన కరోనా పాజిటివ్ కేసులు 58 ఉన్నాయని వివరించారు. ఆదివారం రాత్రి ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణా వ్యాప్తంగా 25,937 మంది క్వారంటైన్ లేదా ఐసోలేషన్ లో ఉన్నారని, వాళ్ళని 5,746 మెడికల్ టీములు రోజుకు రెండు సార్లు పర్యవేక్షిస్తున్నాయని అన్నారు. వీళ్ళకి 30వ తేదీ నుంచి విడతల వారీగా క్వారంటైన్ పీరియడ్ అయిపోతుందని తెలిపారు. వీళ్లలో అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటే 1899 మంది 30వ తేదీన, 1440 మంది 31వ తేదీన, 1462 మంది 01వ తేదీన, 1887 మంది 02వ తేదీన, 1476 మంది 03వ తేదీన, 1453 మంది 04వ తేదీన, 914 మంది 05వ తేదీన, 454 మంది 06వ తేదీన, 397 మంది 07వ తేదీన క్వారంటైన్ లేదా ఐసోలేషన్ ముగిసి విడుదల అవుతారని వివరించారు. సోషల్ మీడియాలో కరోనాపై అనవసరపు ప్రచారం చేసే వారిని గుర్తిస్తున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్లో చాలా కంట్రోల్ ఉందని చెప్పారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేలా ప్రజలకు సీ విటమిన్ పండ్లు అందుబాటులో ఉంచాలని, పండ్ల రవాణా వాహనాలు, నిత్యావసరాల సరఫరా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో 500 కేంద్రాల్లో పండ్లు అమ్మేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యం గింజ, మక్కలు కొనుగోలు చేస్తామని, మార్కెట్లు అన్నీ బంద్ చేస్తున్నామని, ఏ గ్రామ రైతుల ధాన్యం, మక్కలు ఆ గ్రామంలోనే కొంటామని తెలిపారు.
రైతులకు టోకెన్లు ఇచ్చి కొనుగోళ్లు జరిపి, ఆన్లైన్ లో డబ్బులు జమ చేస్తామని, ప్రత్యేక పరిస్తితుల్లో ఉన్నామని, కాబట్టి రైతులు ఓపికగా వ్యవహరించాలని కోరారు. ఈ ప్రక్రియలో వ్యవసాయ విస్తరణ అధికారులు కీలకంగా వ్యవహరించాలని, హార్వెస్టర్లు సమన్వయం చేయాలని సూచించారు. ఎన్నడూ లేని విధంగా 40 లక్షల ఎకరాల్లో వరి పంట పండిందని చెప్పారు. ఇంతటి కఠిన పరిస్తితుల్లో కూడా పౌర సరఫరాల కార్పొరేషన్ కు, మార్క్ ఫెడ్ కు కలిపి 30 వేల కోట్లు సమకూర్చామని, ఇది చరిత్రలో ఎన్నడూ జరగని విషయమని తెలిపారు. గ్రామాల్లో కంచెలు, రాళ్ళ గోడలు ధాన్యం కొనుగోళ్లకు అడ్డు కారాదని, ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, రైతు బంధు సభ్యులు చొరవ తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద కూడా సామాజిక దూరం పాటించాలని, శుభ్రత కొనసాగించాలని అన్నారు. కోటి అయిదు లక్షల టన్నుల ధాన్యం కొనడానికి 75 లక్షల గానీ బ్యాగులు కావాలని, ధాన్యం కొనుగోళ్ళకై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో బయటి రాష్ట్రాలకు చెందిన 12,436 కార్మిక టీములు ఉండగా, వారిలో దాదాపు మూడు లక్షల కార్మికులు ఉన్నారని, వీళ్ళందరికీ రేషన్ కార్డు లేకున్నా కూడా బియ్యం ఇవ్వాలని, ప్రతి ఒక్కరికీ 500 రూపాయలు అందించాలని, షెల్టర్, మెడికల్ కేర్ అందించాలని కేసీఆర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *