గండం గట్టెక్కాలంటే…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, ఏప్రిల్ 11: రాష్ట్ర ప్రజల క్షేమం, శ్రేయస్సు కోసం ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కరోనా వైరస్ నియంత్రణకు ఇప్పటివరకు సహకరించిన ప్రజలు లాక్ డౌన్ ముగిసేవరకు అలాగే సహకరించాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అనంతరం శనివారం రాత్రి సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో శనివారం సాయంత్రం వరకు 503 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 393 మంది చికిత్స పొందుతుండగా, 96 మంది డిశ్చార్జి అయ్యారని అన్నారు. మర్కజ్ వెళ్ళొచ్చిన దాదాపు 1,200 మంది గుర్తించడం జరిగిందని, ఇప్పుడు 1,654 మంది క్వారంటైన్ లో ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో 243చోట్ల హాట్ స్పాట్ సెంటర్లు ఉన్నాయని, ఈ నెల 24 వరకు అందరిని డిశ్చార్జి చేస్తామని తెలిపారు. ఏప్రిల్ 30 తర్వాత దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచన చేస్తామని చెప్పారు. పదవ తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. కరోనా గండం గట్టెక్కడానికి స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు మరోమారు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ నుంచి రైస్ మిల్లులు, పిండి, ఆయిల్ మిల్లులు, ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు మినహాయింపు ఇస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.