JMS News Today

For Complete News

మరో ఛాన్స్ ఇస్తున్నాం…ఇక మీ ఇష్టం

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, నవంబర్ 2: ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ సర్కార్ అదే దోరణితో ముందుకుపోతోంది. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ మరోమారు పునరుద్ఘాటించారు. శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఆర్టీసీ సమ్మె ప్రధాన అజెండాగా క్యాబినెట్ సమావేశం సాగింది. దాదాపు 5 గంటల పాటు సాగిన సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. 49 అంశాలపై క్యాబినెట్ భేటీలో చర్చ జరిగిందని వివరించారు. ఆర్టీసీ సమస్యపై సుదీర్ఘంగా చర్చించామని, పండుగలు, పరీక్షల వంటి కీలక సమయాల్లో బెదిరింపులకు దిగుతూ, సమ్మెలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని నిర్ణయించామని తెలిపారు. సున్నితమైన సమయాల్లో సమ్మెలు చేయడం బ్లాక్ మెయిల్ తరహా పన్నాగాలు అని ఆరోపించారు. సమ్మెకు వెళ్లకూడదని ఆర్టీసీ కార్మికులకు చెప్పినా వినలేదని తెలిపారు. ఆర్టీసీ వాళ్లు అర్థరహితంగా, దురాశాపూరితంగా సమ్మె బాట పట్టారని ఆరోపించారు. ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ తో ఆర్టీసీ సమ్మె చేపట్టిందని, ఇలాంటి బ్లాక్ మెయిల్ వ్యవహారాలు ఇకమీదట ఉండకూడదని భావిస్తున్నామని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరని పని అని సీఏం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని క్యాబినెట్ నిర్ణయించిందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆర్టీసీలో ప్రైవేటు బస్సులకు స్థానం కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందని అన్నారు. అందుకే 5100 ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వాలని క్యాబినెట్ లో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని వివరించారు. పూర్తిగా పనికిరాకుండా పాడైపోయిన బస్సుల స్థానాన్ని ఈ ప్రైవేటు బస్సులతో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. కార్మికులు అంటే మాకు ఏలాంటి కోపం లేదని, వాళ్ళు మా బిడ్డలేనని, నాయకుల మాయలో పడి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న కేసీఆర్ కార్మికులకు మరో అవకాశం ఇస్తున్నామని, 5వ తేదిలోగా భేషరతుగా విధుల్లో చేరాలని కోరారు. లేనిపక్షంలో మిగిలిన రూట్లను ప్రైవేట్ పరం చేస్తామని కేేసీఆర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *