ఇక ఆ గోసలే ఉండవు…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 6: కరెంటు కోతలు..మంచి నీటి గోసలు…సాగు నీటి ఇబ్బందులు లేని రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భవించనుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాదికి సుమారు రూ.5వేల కోట్లు ఖర్చు అవుతుందని, ప్రజల అవసరాల కోసం 5వేలు కాదు…15వేలు కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం ధర్మపురిలో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఏడాదిలో 400 టీఎంసీల నీటిని గోదావరి నుంచి తీసుకుంటామని చెప్పారు. అలాగే దుమ్ముగూడెం పూర్తయితే 100 టిఎంసిలు, దేవాదుల పూర్తయితే 75 టిఎంసిలు.. మొత్తం ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 575 టీఎంసీల నీటిని తీసుకుంటామని వివరించారు. కేవలం మూడేళ్ల కాలంలోనే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే మన సొంత నిధులతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగుతుందని చెప్పారు. వీటితోపాటు చిన్న చిన్న ప్రాజెక్టులను కూడా నిర్మించామని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతాయని, అదేవిధంగా రాష్ట్రంలో కోటి 20 లక్షల ఎకరాల్లో బంగారు పంటలు పండి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. విపక్షాలు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. మీరు ఎంత అరిచిన, నానా యాగీ చేసినా, ప్రజలకు ఎది అవసరమో అది చేసి తీరుతామని స్పష్టం చేశారు. వాస్తవాలు ఓ రకంగా ఉంటే వారో రకంగా ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ప్రజలు పట్టించుకోవద్దని కేసీఆర్ కోరారు. అంతకుముందు అధికారులు, ఇరిగేషన్ ఇంజనీర్లతో కలిసి కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీ పరిశీలించారు. గోదావరి నదీమాతల్లికి పూజలు నిర్వహించి, వాయినం సమర్పించారు. ఇక్కడి నుంచి ధర్మపురి వరకు గోదావరి పరివాహక ప్రాంతాన్ని విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. ధర్మపురి చేరుకున్న కేసీఆర్ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, ఇరిగేషన్ కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, ఓఎస్డీ భూపాల్ రెడ్డి, కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.