పార్లమెంట్లో బండి గళం… కేసీఆర్ పై విమర్శలు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
న్యూఢిల్లీ, జూలై 3: పార్లమెంట్ సాక్షిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తొలి స్పీచ్ తో అదరగొట్టారు. ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. బుధవారం లోక్ సభలో జీరో అవర్ లో సంజయ్ మాట్లాడుతూ, తెలంగాణలో నీరో చక్రవర్తిలా కేసీఆర్ పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపార దృక్పథంతో చూస్తున్నారని, అనుభవం లేని గ్లోబరినా సంస్థకు ఫలితాల విడుదల బాధ్యతను అప్పగించారని విమర్శించారు. ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఇచ్చినా ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గవర్నర్ నిక్కచ్చిగా వ్యవహరించాలని సంజయ్ కోరారు. కాగా, లోక్ సభ లో బండి తొలిసారిగా ఒణుకుబెణుకు లేకుండా చక్కగా మాట్లాడారని సోషల్ మీడియా లో హర్షం వ్యక్తమవుతోంది.