JMS News Today

For Complete News

కీలక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఫిబ్రవరి 13: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా, సాగునీటి లక్ష్యాల సాధనకు ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల పునర్ వ్యవస్థీకరణ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ విభాగాలు ఒకే గొడుగు క్రిందికి తీసుకువస్తామని తెలిపారు. సాగు నీటి ఇంజనీరింగ్ వ్యవస్థ ను 11 సర్కిళ్లుగా విభజన చేసి, సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజనీర్ ను నియమిస్తామని చెప్పారు. గురువారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్లో సాగునీటి రంగం పై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సుమారు మూడు గంటలకు పైగా నిర్వహించిన ఈ సమావేశంలో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తి పోసేలా అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యాచరణ సిద్ధం చేయాలని పేర్కొన్నారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోనేలా బ్యారేజీల ఆపరేషన్ రూల్స్ కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. జూన్ నెలా ఖరులోగా ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల లో ఖాళీలు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు లోగా ఇరిగేషన్ అధికారులు, సిబ్బందికి క్వార్టర్ ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. సాగునీటి కాలువలకు మే నెలాఖరు లోగా అవసరమైన అన్ని మరమ్మత్తులు చేపట్టాలని అన్నారు. కరీంనగర్ తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ ల స్థానంలో కొత్త కలెక్ట రేట్ ల నిర్మాణం చేపట్టాలని, కొత్త కలెక్టరేట్ లను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకృష్ణ, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ కె శశాంక, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాగా, బుధవారం రాత్రి కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ లో బస చేసిన కేసీఆర్ గురువారం ఉదయం ఇక్కడి నుంచి హెలికాప్టర్ లో కాళేశ్వరం వెళ్ళారు. అనంతరం తిరిగి సాయంత్రం కరీంనగర్ చేరుకుని సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *