ఆ ప్రసక్తే లేదు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, అక్టోబర్ 22: ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల సీఎం కేసీఆర్ అదే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదంటూ కేసీఆర్ మరోసారి కుండ బద్దలు కొట్టినట్లు సమాచారం. సమ్మె నేపథ్యంలో హైకోర్టు కార్మికులతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన దరిమిలా మంగళవారం రాత్రి కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సాగిన భేటీ ముగిసింది. ఇప్పటికే సమ్మెలో పాల్గొన్న కార్మికులను ఉద్యోగాల్లోంచి తీసేశామని, వారు తిరిగి ఉద్యోగాలు ఇవ్వమన్నా ఇచ్చే పరిస్థితి లేదని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని జీతాలు పెంచమని ఎలా అడుగుతారు? అని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. నష్టాలకు ఆర్టీసీ యూనియన్లే కారణమని, నష్టాల్లో ఉన్న సంస్థలో జీతాలు పెంచమని ఏ కోర్టు చెప్పదని పేర్కొన్నట్లు తెలిసింది. ఆర్టీసీ దివాళ స్థితిని కోర్టు ముందు ఉంచాల్సిన బాధ్యత అధికారులదేనని సూచించినట్లు సమాచారం. యూనియన్లతో లాలూచీ పడాల్సిన అవసరం తమకు లేదని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు, విలీనం మినహా మిగతా అంశాలపై చర్చించేందుకు అధికారులతో కమిటీ వేశారు. ఈ కమిటీ రెండు మూడు రోజుల్లో నివేదికలు తయారు చేయనుంది. యూనియన్లు లేని ఆర్టీసీ కావాలని, యూనియన్లు లేకుంటే ఆర్టీసీ లాభాల బాట పడుతుందని కేేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఆర్టీసీ యూనియన్ నాయకులు ఏలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరీ.