కదం తొక్కిన కాషాయ దండు…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 12: మున్సిపల్ ఎన్నిక ప్రక్రియ లో అవకతవకలు జరిగాయని, అధికార పార్టీ తమకు అనుకూలంగా మలుచుకుందని ఆరోపిస్తూ, శుక్రవారం కాషాయ దండు కదం తొక్కింది. బిజెపి శ్రేణులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి, ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు మాట్లాడుతూ, అడ్డదారిలో అవకతవకలకు పాల్పడుతూ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మజ్లిస్ పార్టీ కనుసన్నల్లో నూతన డివిజన్ల ఏర్పాటు చేశారని ఆరోపించారు. ప్రజాబలంతో ఎన్నికల్లో మజ్లిస్, టిఆర్ఎస్ పార్టీల నుంచి కరీంనగర్ ను రక్షించడమే బిజెపి ధ్యేయమని పేేర్కొన్నారు. బీజేపీని ఎన్నికల్లో నైతికంగా ఎదుర్కొనే ధైర్యం లేక టిఆర్ఎస్ పార్టీ అధికార ఒత్తిళ్లతో ఎన్నికల ఏర్పాట్ల నిర్వహణ ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని ఆరోపించారు. గత శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే ఎంఐఎం తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న టిఆర్ఎస్ నాయకత్వం కరీంనగర్ బల్దియా మేయర్ స్థానాన్ని ఎంఐఎం పార్టీకి అప్పగించేందుకు నిర్వహించారని ఆయన ఆరోపించారు. అందుకు అనుకూలంగా మజ్లిస్ పార్టీ సూచనలు, సలహాల మేరకు డివిజన్ల విభజన ప్రక్రియను చేపట్టారని ఆయన విమర్శించారు. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని శాస్త్రీయంగా, సాంకేతికంగా విభజించాల్సిన డివిజన్లను కేవలం తమ గెలుపు కు అనుకూలంగా మాత్రమే డివిజన్ల ఏర్పాటు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అమలులో కూడా శాస్త్రీయత పాటించలేదని, నగరపాలక సంస్థలో కొనసాగుతున్న అనధికారిక, ప్రైవేట్ ఉద్యోగులతో బీసీ గణన చేపట్టారని, బిల్ కలెక్టర్ల, ప్రైవేట్ అసిస్టెంట్లతో, కార్మికులతో ఇష్టారాజ్యాంగ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అమలు చేశారని దుయ్యబట్టారు. జరిగిన అవకతవకలను ప్రజల ముందుకు తీసుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్, టిఆర్ఎస్ కుట్రలను తిప్పికొడతామని, కరీంనగర్ బల్దియా మేయర్ పీఠాన్ని బిజెపి ఖచ్చితంగా కైవసం చేసుకుంటుందని తెలిపారు. 24 గంటల పాటు నిరంతర నీటి సరఫరా చేస్తామని, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి మున్సిపాలిటీ, శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని ప్రతి పేదవాడికి సామాన్యుని, మధ్య తరగతి ప్రజలను టిఆర్ఎస్ పార్టీ వంచించిందని మండిపడ్డారు. మధ్య తరగతి, పేద ప్రజల ఉసురుతో మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మట్టి కరిచి పోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నగర అధ్యక్షులు బేతి మహేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొరిటాల శివరామయ్య, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జ సతీష్, బిజెపి నాయకులు చంద్రశేఖర్ (మార్షల్) తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, హరి కుమార్ గౌడ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు (మాజీ కార్పొరేటర్) రాపర్తి విజయ, బిజెపి నగర ప్రధాన కార్యదర్శి బండ రమణారెడ్డి, జవాజి రమేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కటకం లోకేష్, నాంపల్లి శ్రీనివాస్, సర్దార్ సంజిత్ సింగ్, బిజెపి మండల అధ్యక్షులు రతన్, గాజుల స్వప్న , బండ అనిత, శ్రీకాంత్, బ్రహ్మం, ఎం డి ముజీబ్, నాగసముద్రం ప్రవీణ్, రాజు, తిరుపతి ,శ్రీనివాస్, కాశి రెడ్డి శేఖర్, సంపత్ ,రమేష్ మహేష్ ,సురేష్, రవి పర్వేజ్, బల్బీర్ సింగ్, కలికోట ముఖేష్, నవీన్, శ్రీ రాముల శ్రీకాంత్, తణుకు సాయి, పురం హరి, అభిలాష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.