JMS News Today

For Complete News

ఉప్పోంగింది…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 11: స్వాతంత్ర్య భారతావని వజ్రోత్సవ సంబురం అజరామర విరచితమై.. దేశభక్తి తరంగం నరనరాన ఉప్పోంగి.. కరీంనగరం త్రివర్ణమైంది. మువ్వన్నెల పతాకాల రెపరెపలతో మురిసిపోయింది. భారత్ మాతా కీ జై అంటూ వేలాది గొంతుకల నినాదాలతో మార్మోగింది. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం కరీంనగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ రన్ నాభూతో…నా భవిష్యత్ అన్నట్టుగా విజయవంతమైంది. అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్ట్స్ కాలేజీ ఆవరణలోని జాతీయ పతాకం వరకు ఈ రన్ కొనసాగగా, మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఫ్రీడమ్ రన్ ను ప్రారంభించారు. మంత్రి గంగుల ర్యాలీ ముందు త్రివర్ణ పతాకంతో ముందుకు సాగగా… వేలాదిగా కరీంనగర్ వాసులు పాల్గొని…భారత్ మాతాకి జై అంటూ…మువ్వన్నెల పతాకాలతో కదంతొక్కారు. దీంతో కరీంనగర్ లోని రహదారులన్ని త్రివర్ణమయమై…స్వాతంత్ర్య దినోత్సవ సందడి చోటుచేసుకుంది. ఈ ఫ్రీడమ్ రన్ లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 500 మీటర్ల భారీ జాతీయ  పతాకం ప్రధానాకర్షణగా నిలిచింది. ఇది ఇలా ఉంటే…చిన్నారులు వివిధ స్వాతంత్ర్య సమరయోధుల వేషాధారాణలతో తరలి వచ్చి ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. భారతదేశ స్వాతంత్ర్య సిల్వర్, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల కన్నా ఘనంగా వజ్రోత్సవాలను నిర్వహించుకుంటున్నామని అన్నారు. సిఎం కెసిఆర్ పిలుపు మేరకు ప్రపంచ దేశాలు ఈర్ష్య పడేవిధంగా భారతమాత ముద్దు బిడ్డలు గర్వపడే విధంగా 15 రోజుల పాటు వేడుకలు నిర్వహించుకుందామన్నారు. విదేశాలకు చెందిన ముష్కరులు ఈ దేశ ప్రజలను హింసించి దోపిడీకి పాల్పడుతుంటే… ఆసేతు హిమాచలం..కర్మభూమి..త్యాగభూమి.. పుణ్యభూమి కోసం…ఎంతో మంది మహానీయులు…తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి…తెల్ల దొరల దాశ్య శృంఖలాల నుంచి భారతమాతను విముక్తి చేసేందుకు అలుపెరుగుని పోరాటం చేశారన్నారు. పోరాడితే పోయేది ఏముంది… ప్రాణాలు తప్ప అంటూ…ఎందరో అమరులయ్యారన్నారు. ఎందరో వీరుల త్యాగఫలంతో 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల్లో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో దూసుకుపోతుందన్నారు. అభివృద్ది ఫలాలు ప్రతి భారతీయుడికి చేరుతున్నాయన్నారు. మహాత్మా గాంధీ లాంటి సమరయోధులు అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రాన్ని తీసుకువస్తే…సీఎం కేసీఆర్ సైతం అహింస మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి స్వరాష్ట్రాన్ని సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. స్వయం పాలనలో తెలంగాణ అభివృద్దిలో దూసుకుపోతూ…స్వరాష్ట్ర ఫలాలు ఇప్పుడిప్పుడే ప్రతి తెలంగాణ బిడ్డకు అందుతున్నాయన్నారు. సిఎం కేసిఆర్ పిలుపుమేరకు 15 రోజులపాటు వజ్రోత్సవ సంబురాలు నిర్వహించుకుందామన్నారు. మహానీయులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకు స్వతంత్ర్య భారతాన్ని కానుకగా అందిస్తే… మనం విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించి… పర్యావరణాన్ని భావితరాలకు కానుకగా అందిద్దామన్నారు. అంతే కాకుండా… తల సేమియా రోగులకు అండగా నిలిచేందుకు విరివిగా రక్తదాన శిబిరాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యత…సమగ్రత కోసం ప్రతి ఒక్కరు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈనెల 16న ఏకకాలంలో సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడంతో పాటు ఈనెల 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ పతాకం రెపరెపలాడాలని, ప్రతి ఒక్కరు తమ తమ ఇళ్ళ పై జాతీయ పతాకాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ ర్యాలీలో మధ్యప్రదేశ్ జబల్ పూర్ కు చెందిన ఇంటర్నేషనల్ శ్యామ్ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సారే జహాన్ సే అచ్చ అంటూ శ్యామ్ బ్యాండ్ మ్యూజిక్ చిన్నపెద్ద తేడాలేకుండా అందరిని పులకరింపజేసింది, ఆలోచింపజేసింది. చివరగా జనగణమన జాతీయగీతాలపనతో ఫ్రీడమ్ రన్ కార్యక్రమం ముగిసింది. ఈ రన్ లో జడ్పీ ఛైర్ పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్ రావు, సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు  గరిమ అగర్వాల్, శ్యాంప్రప్రాద్ లాల్, వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నాయకులతోపాటు పెద్ద ఎత్తున నగరవాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.