కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నిరసన
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, నవంబర్ 8: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ నిరసన బాటపట్టింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ లోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం నాయకులు అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల దేశం, రాష్ట్రం ఆర్థిక మాంద్యానికి గురై ఈరోజు ప్రజల బతుకులు దుర్భరమయ్యాయని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకొని ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మేడిపల్లి సత్యం, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కవ్వంపల్లి సత్యనారాయణ, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అంజన్ కుమార్, మారుతీ రావు, పొన్నం సత్యం, నాగి శేఖర్ లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.