JMS News Today

For Complete News

కరోనా కల్లోలవేళ.. కంటేజియన్ చర్చ..

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, మార్చి 23: అప్పుడెప్పుడో 2011లో తీసిన సినిమా ఇప్పుడు ఓ హాట్ కేకైంది. అప్పుడు సినిమా చార్ట్ బస్టర్ లో 68, 69 స్థానంతో సరిపెట్టుకున్న ఆ హాలీవుడ్ మూవీ… ఇప్పుడు హ్యాపీపొట్టర్ తర్వాత ఎక్కువ వ్యూయర్ షిప్ ను సంపాదించుకుందట. మరెంటా సినిమా… 2011లో తీసిన మూవీకి ఇప్పుడెందుకంత క్రేజ్…? ఇప్పుడంతా కరోనా మహమ్మారి బారిన పడిన ప్రపంచంలో… పలువురు పాజిటివ్ కేసులతో ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడుతుండగా… మరికొందరు హాస్పిటల్ క్వారంటైన్ కేంద్రాల్లో… ఇంకొందరు హోం క్వారంటైనే సెంటర్లుగా చేసుకుని భయం భయంగా బతుకీడ్చేఆందోళనకర పరిస్థితి నెలకొంది. భారత్ తో సహా… ఇప్పటికే ప్రపంచదేశాలన్నీ జనతా కర్ఫ్యూ పేరిట… స్వీయనిర్భంధంలోనే ఉండాలని కోరుతున్న పరిస్థితుల్లో… దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలలన్న తేడా లేకుండా సరిహద్దులు కూడా మూసేసిన వేళ… ఇండ్లకే పరిమితమవుతున్న చాలా మంది ఇప్పుడా సినిమా కోసం ఓటీటీల బాట పట్టారు. అంతేకాదు గూగుల్ సెర్చ్ తో ఆ సినిమా గురించి తెలుసుకునేందుకు ఉత్సాహం కూడా చూపిస్తున్నారట. ఎందుకంటే ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా సమస్యను పట్టిచూపించే విధంగా ఆ సినిమా ఉండటమే అందుకు ప్రధాన కారణం. నాటి ప్లేగు నుంచి మొదలుకుంటే… 2002-04 మధ్యలో భయపెట్టిన సార్స్, 2009లో వచ్చిన ఫ్లూ వంటి వ్యాధి సోకిన తదనంతరం జరిగిన పరిణామాలను ఆసరాగా చేసుకుని తీసిన ఓ మెడికల్ థ్రిల్లర్ గా ఆ సినిమా నిలవడంతో పాటు… ఇప్పుడు మళ్లీ కరోనా ముంచుకొచ్చిన వేళ ఇళ్లకు పరిమితమైన ఎంతో మంది ఆ సినిమాపై దృష్టి సారించారు. అదే కంటేజియన్.

2009లో ది ఇన్ఫర్మెంట్ సినిమాతో మొదలైన డైరెక్టర్ సోదర్ బర్గ్, రచయిత స్కాట్. జెడ్. బర్న్స్ సృష్టే మెడికల్ థ్రిల్లర్ గా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న కంటేజియన్ సినిమా. సినిమాకు ముందే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ను సంప్రదించడంతో పాటు… మెడికల్ ఫీల్డ్ లో నిపుణలెందరినో కలిసి ఆ కథకు ఒక రూపమిచ్చారు రచయిత స్కాట్. జెడ్. బర్న్స్. 60 మిలియన్ డాలర్స్ఖ్ ఖర్చుపెట్టి తీసిన ఈ సినిమా… నాడు135 మిలియన్ డాలర్స్ ను సంపాదించి పెట్టినా… దర్శకుడనుకున్న స్థాయి క్రేజ్ నైతే సంపాదించుకోలేదనే చెప్పొచ్చు. అయితే అప్పుడు కూడా ఎందరో శాస్త్రవేత్తలను కూడా మెప్పించిన ఆ సినిమా ఇప్పుడు మరోసారి చర్చకు రావడం… చూడ్డానికి ఆసక్తి చూపడానికి కారణం… నేటి కల్లోల కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులే. అంతేకాదు… నాడు రచయిత, దర్శకుడు ఓ ప్రాణాంతక వైరస్ చుట్టూ అల్లిన కథ కూడా చైనా నుంచే ప్రారంభమై ప్రపంచాన్ని కబళించడంతో పాటు… గబ్బిలాలే ఆ సినిమాలో వైరస్ కు ప్రధాన కారణంగా చూపించడంతో… నేడు చైనాలోని వ్యూహాన్ లో పుట్టిన కరోనాతో పోల్చుకునే విధంగా… ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సినిమాకు ప్రతిబింబంలాగానే నేటి పరిస్థితులు కనిపించేలా చిత్రీకరించడంతో ఈ సినిమా మరోసారి స్వీయ నిర్భంధంలో ఇళ్లకే పరిమితమైన ఎందరినో వీక్షించేలా చేస్తోంది.

తన బిజినెస్ ట్రిప్ ముగించుకుని బెత్ ఎమ్హోఫ్ అనే మహిళ హాంకాంగ్ నుంచి చికాగోకు బయల్దేరుతుంది. తన మాజీ ప్రియుడితో సహజీవనం కోసం చికాగో చేరుకున్న బెత్ ఎమ్హోఫ్ రెండు రోజుల తర్వాత సబర్బన్ లోని మిన్నెపోలిస్ లోని తన ఇంటికి చేరుకుంటుంది. అక్కడికి చేరుకున్నఆ కుటుంబంలో బెత్ ఎమ్హోఫ్ మూర్ఛకు గురికావడంతో ఆందోళన చెందిన మిచ్ ఎమ్హెఫ్ ఆమెను ఆసుపత్రికి తరలిస్తాడు. కానీ ఆమె బతుకపోగా… ఎందుకు చనిపోయిందో అప్పటికప్పుడే వైద్యులు గుర్తించలేకపోతారు. మిచ్ ఇంటికి తిరిగివచ్చేసరికి… తన సవతి కొడుకైన క్లార్క్ కూడా తల్లి బెత్ లాగే చనిపోవడంతో మిచ్ ఆందోళనకు గురవుతాడు. అదే సమయంలో మిచ్ ను కూడా ఐసోలేషన్ లో పెడతారు. అయితే కొంతకాలానికి తన ఇమ్యూనిటీ పవర్ తో తెలియని వ్యాధి నుంచి తప్పించుకున్న మిచ్ తన కూతురు జోరీ వద్దకు చేరుకుంటాడు. అంటే రోగనిరోధక శక్తి ఉన్నప్పుడు ప్రాణాంతక వైరస్ నుంచి కూడా ఎలా బయటపడతారనే విషయాన్ని కూడా డైరెక్టర్ సోదర్ బర్డ్ ఈ సినిమాలో చూపించారు. ఆ వ్యాధి కాస్తా ఫ్లూగా అనుమానం మొదలైన నేపథ్యంలో… వైద్యులు, శాస్త్రజ్ఞులు దానిపై పరిశోధనలు చేసే క్రమంలో అదిఉగ్రవాదుల ఆలోచన నుంచి పుట్టిన బయోవెపన్ అయి ఉండొచ్చన్న అనుమానాన్నీ వెలిబుచ్చుతారు. MEV-1 (మెవ్-1) వైరస్ గా నామకరణం చేయబడ్డ వైరస్ విషయంలో ఇక పరిశోధన మొదలయ్యే క్రమం… అందుకోసం కావల్సిన వ్యాక్సిన్ తయారీ అవసరం, తయారుచేసే క్రమంలో కనిపించే అపసోపాలువంటివన్నీ దర్శకుడు వెరీ ఇన్ఫర్మేటిక్ గా చూపించే యత్నం చేశాడు. ఎపిడమిక్ ఇంటలిజెన్స్ ఆఫీసరైన డాక్టర్ ఎరిని మియర్స్ తన పరిశోధనలో భాగంగా… బెత్ హాంకాంగ్ నుంచి వచ్చేముందు వచ్చాక ఎవరెవరిని కలిసుంటుంది… వారి పరిస్థితేంటన్న కోణంలో తన ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. కొంతమంది బ్యూరోక్రాట్స్ ను కూడా కలిసినట్టుగా తన పరిశోధనలో కనుక్కుని వారిని కలిసిన తరుణంలోనే… ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా ఉన్న మియర్ ఆ ఫ్లూ తనకు కూడా సోకి మరణిస్తాడు. అప్పటికే చికాగోలో కంటికి కనిపించని ఆ వైరస్ ప్రాణాంతకంగా మారి మరణమృదంగం మోగుతూ… చికాగో మొత్తం ఓ క్వారంటైన్ గా మారిపోతుంది. అయితే మొత్తానికి ఆ వైరస్ కు కారణం కూడా చైనాలో ఇష్టానుసారం జంతువులను తినడం వల్లే కరోనాకు కారణమంటూ ఇప్పుడు సోషల్ మీడియా, మీడియాలో జరుగుతున్న ప్రచారం లాగే… గబ్బిలం వదిలేసిన అరటిపండును ఓ పంది తినడం… ఆ పందిని మాంసాహారంగా వండిన చెఫ్ వల్లే ఆ వైరస్ సోకడమనే కాన్సెప్ట్ తో సినిమా కథను నడిపించిన తీరు ఆసక్తికరంగా, థ్రిల్లింగ్ గా… ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు. గతంలో జరిగిన పరిణామాలకు అద్దంపట్టేలా కనిపిస్తుంది. అంతేకాదు… ప్రకృతి విపత్తులు వచ్చినా… ప్రాణాంతక వైరస్ వంటివి సోకినా… ప్రపంచయుద్ధాలు జరిగినా… ఆయా సమయాల్లో ఉండే ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకునేందుకు ముందుకొచ్చే అమానవీయ మాఫియా ముఠాల గూడుపుఠాణీని కూడా అలన్ కృమీవీడ్ అనే క్యారక్టరైజేషన్ తో ఈ కంటేజియన్ లో అద్భుతంగా చూపించాడు దర్శకుడు. అలన్ తాను వైరస్ బారిన పడకపోయినప్పటికీ… తాను వైరస్ బారిన పడ్డట్టు.. తాను తయారు చేసిన హోమియోపతిక్ మెడిసిన ఫోర్సితియాతో క్యూరయ్యానంటూ తన బ్లాగ్ లో ఓ వీడియో పోస్ట్ చేయడంతో… అప్పటికే ఫ్లూతో భయాందోళనలకు గురవుతున్న జనం ఆ ఫ్లూ కోసం ఫార్మసీలను సంప్రదిస్తుంటారు. అలన్ మెడికల్ గూడుపుఠాణీ సంగతి బయటపడుతుంది. అలన్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు… ఆరోగ్యభద్రతకు సంబంధించి పాల్పడిన మోసానికి కేసులు నమోదవుతాయి. అయితే ఒకవైపు చైనా నుంచి చికాగోకు వచ్చి.. ప్రపంచాన్ని చుట్టేస్తూ కబళిస్తున్న MEV-1వైరస్ కు వ్యాక్సిన్ ను కనుక్కునే ప్రయత్నాలు కూడా ముమ్మురమవ్వడం… హెక్స్ట్టాల్ అనే ఓ శాస్త్రవేత్త చివరగా వ్యాక్సిన్ ను కనుక్కుని… ఆ వ్యాక్సిన్ ను తనపైనే ప్రయోగం చేసుకుని… వైరస్ సోకిన తన తండ్రి దగ్గరకు వెళ్లినప్పుడు తనకు ఆ వైరస్ సోకకపోవడంతో… ఆ వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైనట్టుగా సినిమాలో చూపిస్తారు. అయితే అప్పటికే మరణాల సంఖ్య అమెరికాలో 2.5 మిలియన్లుగా… ప్రపంచవ్యాప్తంగా 26 లక్షలకు చేరుకుని ఒక విషాద పరిస్థితి నెలకొంటుంది. చివరగా అంతర్జాతీయ ఆరోగ్యసంస్థ ఎపిడమాలిజిస్టైన డాక్టర్ లియొనోరో ఓరంట్స్… పలువురు ప్రజారోగ్య అధికారులతో కలిసి… మొదటగా బెత్ కు ఆ వైరస్ ఎలా సోకిందన్న కోణంలో పరిశోధిస్తూ… మకావూ క్యాసినోకు చేరుకుంటుంది. అదే సమయంలో అక్కడి ఓ అధికారి ఓరంట్స్ ను తమ గ్రామాన్ని కాపాడుకోవడానికి వ్యాక్సిన్ కోసం కిడ్నాప్ చేయడం… ఓరెంట్స్ కొన్ని నెలలపాటు అక్కడే ఉండాల్సిరావడం.. చివరగా డబ్ల్యూహెచ్వో అధికారులు వ్యాక్సి న్ విడుదల చేసి వారికందివ్వడంతో ఆమె విడుదలవుతారు.
కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ లోకెళ్లితే… ఓ బుల్ డోజర్ తో ఓ చెట్టును కొట్టేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుంపుగా ఎగిరే గబ్బిలాల్లో ఓ గబ్బిలం… తన నోట కర్చిన ఓ అరటిపండు ముక్కను కిందకు జారవేయడం… ఆ పండు ముక్కను ఓ పంది తినడం… దాన్ని రెస్టారెంట్ లో వండిన చెఫ్… బెత్ తో మాట్లాడుతూ
షేక్ హ్యాండివ్వడంతో ఆ వైరస్ సోకినట్టుగా అంతర్జాతీయ ఆరోగ్యసంస్థ నిపుణులు గుర్తించడంతో సినిమా ముగుస్తుంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడింతలా ఎందుకు డిస్కషనంటే… నేటి కరోనా కాలమాన పరిస్థితులకు అచ్చుగుద్దినట్టే ఈ సినిమాను చిత్రీకరించడమే అందుకు ప్రధాన కారణం. సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ పాలు ఎక్కువ కనిపించకపోవడం… సినిమా అప్పట్లో అనుకున్న స్థాయిలో ఆకట్టుకునేందుకు కారణమై ఉండకపోవచ్చునేమోగానీ… ఓ ప్రాణాంతక వైరస్, దాని తాలూకు ప్రభావాలు అనే అంశాలను మాత్రం ప్రస్తుత కాలమాన పరిస్థితులకనుగుణంగా సరైన ఊహతో రచయిత పేర్కొనడం… అదేవిధంగా ఓ మెడికల్ థ్రిల్లర్ గా దర్శకుడు చిత్రీకరించడంతో… ఇప్పుడీ సినిమా మరోసారి హ్యారీపొట్టర్ తర్వాత ఎక్కువ వీక్షించేందుకు కారణమవుతోందంటున్నారు విశ్లేషకులు. మరాలస్యమెందుకు… సెల్ఫ్ కర్ఫ్యూ నేపథ్యంలో… మీరూ ఓటీటీకి స్విచ్ఛానై… చూసేయండి మరీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *