ఇక్కడ అదే టెన్షన్….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మార్చి 19: రాష్ట్రంలో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో కరీంనగర్ నుంచే ఎనిమిది కేసులు ఉండటంతో అందరి దృష్టి కరీంనగర్ పై పడింది. తాజాగా చోటుచేసుకుంటున్న పరిస్థితుల దరిమిలా కరీంనగర్ జిల్లా కేంద్రంలో అప్రకటిత కర్ఫ్యూ కనిపిస్తోంది. ఎప్పుడు జన సంచారంతో కిటకిటలాడే జిల్లా కేంద్రం ఇప్పుడు బోసిపోయి కనిపించింది. బుధవారం ఒక్కరోజే కరీంనగర్లో ఏడు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. కరీంనగర్ సగం నగరాన్ని నిర్భందించింది. ఆ ప్రాంతంలో విద్యా, వ్యాపార, రవాణా వ్యవస్థలను బంద్ చేసింది. నగరంలో ప్రముఖ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఫలితంగా వ్యాపార కూడళ్లు జనం లేక వెలవెలబోయాయి. అటు ప్రత్యేకంగా 100 వైద్య బృందాలను రంగంలోకి దింపింది. ఈ వైద్య బృందాలు గురువారం అనుమానిత ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు చేశారు. 6,126 ఇళ్లల్లోతనిఖీలు నిర్వహించి, 25వేల మందిని స్క్రీనింగ్ చేశారు. ప్రజలు సైతం స్వచ్ఛందంగా కరోనా పరీక్షలకు ముందుకు వస్తున్నారు. ఇళ్లలో నుంచి ఏ ఒక్కరు బయటకు రావద్దని కలెక్టర్, మున్సిపల్, పోలీసు కమిషనర్ తదితరులు ఇప్పటికే ప్రజలకు సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ చుట్టూ 3 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ నిషేదాజ్ఞలు విధించారు. మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కేంద్రంలోని అనుమానిత ప్రాంతాల్లో పర్యటించి, వైద్య సిబ్బందితో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సిబ్బంది తో పాటు ఆశావర్కర్లను అప్రమత్తం చేశారు. కరోనా టెస్టులకు సంబంధించి ఆశా వర్కర్లకు ,వైద్య అధికారులకు పలు సూచనలు చేశారు. ఆశా వర్కర్లు విధిగా మాస్కులు ధరించి విధులకు హాజరు కావాలని సూచించారు. అంతకుముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎం అండ్ హెచ్ఓ) కార్యాలయంలో మంత్రి కమలాకర్ జిల్లా అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ సూచనల మేరకు మంత్రి గంగుల కమలాకర్ బుధవారం రాత్రి నుండి ఎప్పటికప్పుడు వైద్య అధికారులకు , పోలీస్ సిబ్బందికి తగు సూచనలు చేస్తూ ప్రజల్లో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చిన కేసీఆర్ స్వీయ జాగ్రత్తలే మనకు శ్రీ రామరక్ష అంటూ సూచించారు. మొత్తానికి కరోనా భయం ప్రజలను వెంటాడుతుండగా, కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.