అర్చకులకూ..లాక్…..!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మే 15: దేవుడికి నిత్యం నైవేద్యం సమర్పించే పేద పూజారులకు పూట గడవడం గగనంగా మారింది. కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ దరిమిలా చిన్న చిన్న ఆలయాల్లో పనిచేసే పూజారులు, ఇతరత్రా శుభకార్యాలు నిర్వహించే పూజారుల బతుకులకు లాక్ పడింది. ఓ వైపు చిన్న చిన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వం అందించే దూప దీప నైవేద్యం అందని ద్రాక్షగా మారగా, మరోవైపు రేషన్ కార్డులు లేక రాష్ట్ర సర్కారు అందించే బియ్యం, నగదు నోచుకోని పరిస్థితి నెలకొంది. సుమారు 53 రోజులుగా ఇటు ఆలయాలు మూసి ఉండటం, అటు పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇతరత్రా శుభకార్యాలు లేకపోవడం వెరసీ పేద పూజారులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పల్లెల్లో ఉన్న పూజారుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అన్ని వర్గాలకు ఎదో రకంగా చేయూతనిస్తున్న అధికార నేతలు పూజారుల వైపు చూడటం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న ఆలయాల్లో పనిచేసే పూజారులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇతరత్రా శుభకార్యాలు చేస్తూ బతుకులిడ్చే పేద పూజారుల కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ కుటుంబాల్లో చాలా మందికి రేషన్ కార్డులు కూడా లేవు. కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ సుమారు 53 రోజులకు చేరింది. ఫలితంగా ఎన్నడూ లేనటువంటి, చూడని విధంగా పేద పూజారులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవడం కష్టంగా మారిన ఈ పరిస్థితుల్లో స్వంత ఇళ్ళు లేని చాలా మంది ఇంటి కిరాయిలు, కరెంటు బిల్లులు కట్టలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. గత 53 రోజులుగా చేతిలో పనిలేక చాలా మందికి పూట గడవడమే కష్టంగా మారిన దరిమిలా పేద పూజారులు ఎంతో మనో వేదనకు గురి అవుతున్నారు. అన్ని వర్గాలకు ఎదో రకంగా చేయూతనిస్తున్న అధికార నేతలు పూజారుల వైపు చూడటం లేదు. ఈ లాక్ డౌన్ ఈ నెల 29 వరకు రాష్ట్ర ప్రభుత్వం పోడిగించింది. ఈ కఠినమైన పరిస్థితిలో పేద పూజారుల ఆకలి తీర్చి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పేద పూజారులను ఆదుకోవాలి
* చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం నేత శ్రీనివాస స్వామి
కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ నేపథ్యంలో పూజారులకు పూట గడవని పరిస్థితి నెలకొందని, ఇందులో ఆర్థికంగా వెనకబడిన చాత్తాద శ్రీ వైష్ణవ సమాజానికి చెందిన పూజారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు జగన్నాధం శ్రీనివాస స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గత 53 రోజులుగా ఇటు ఆలయాల్లో పూజా కార్యక్రమాలు లేక, అటు పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇతరత్రా శుభకార్యాలు లేక ఆర్థిక కష్టాలతో పేద చాత్తాద శ్రీ వైష్ణవ పూజారులు కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా పేద పూజారులకు ఉన్నటువంటి ఆర్థిక అవసరాలు, స్థానిక పరిస్థితులను, ప్రభుత్వాలు అర్థం చేసుకుని వారికి నెలకు రూ.10వేలు అందించి ఆదుకోవాలని శ్రీనివాస స్వామి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.