హతవిధి…ఏమిటిది…!?
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 17: ఓ వైపు కరోనా మహమ్మారి నాన్ స్టాప్ గా తన పంజా విసురుతూ ముందుకు సాగుతుండగా, మరోవైపు అదే తరహాలో నాన్ స్టాప్ గా గత ఐదు రోజులుగా ఎడతెరిపిలేని ముసురు వానలు ముంచెత్తడం అందరిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో గత ఐదు రోజులుగా నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చెరువులు, కుంటలు జల సిరిని సంతరించుకున్నాయి. పలుచోట్ల రహదారులు దెబ్బ తిన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, అక్కడి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొన్ని మండలాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. పలుచోట్ల పాత ఇండ్లు కూలిపోయాయి. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని చోట్ల చెట్లు, కరెంట్ స్థంబాలు పడిపోయాయి. ఫలితంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది.
పలు గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా అన్ని చోట్ల ముసురు వానలు పడగా, కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షం కురిసింది. భారీగా వచ్చి చేరుతున్న వరద నీరుతో లోయర్ మానేర్ డ్యాం (ఎల్ఎండి) జల కల సంతరించుకుంది. 24టీఎంసీల సామర్ధ్యం కలిగిన ఎల్ఎండిలో సోమవారం ఉదయం 9గంటల వరకు 16.991 టిఎంసిలకు చేరింది. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, మానకొండూర్ తదితర మండలాల్లో జిల్లా మంత్రులు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్ పర్యటించారు. వరద ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరో రెండు మూడు రోజులు వానలు కురుస్తాయని వాతావరణం శాఖ ప్రకటించిన దరిమిలా అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు కరోనా..మరోవైపు వానలు పరేషాన్ చేస్తుండటంతో హతవిధి..ఏమిటిది అంటూ జనం వాపోతున్నారు. కాగా, వర్షాలపై మరికొన్ని గంటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు.