వాళ్ళెవరో…ఎంతమందో…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మార్చి 3: తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాపైనే చర్చ జరుగుతోంది. దుబాయ్ నుంచి వచ్చిన తరువాత కరోనా బాధితుడు ఎంత మందిని కలిశాడు? అతనికి ఎన్ని రోజుల క్రితం వైరస్ సోకింది? అతని నుంచి ఎంత మందికి వైరస్ వ్యాపించింది? వారి నుంచి ఇంకెంతమందికి వైరస్ పాకింది? ఇలాంటి సందేహాలెన్నో ఓవైపు ప్రజలను కలవరపరుస్తుండగా, ఇదే విషయం మరోవైపు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. బాధితుడు వచ్చాక ఎంతమందిని కలిసారు? వారు ఏ ఏ ప్రాంతాలకు చెందిన వారు? బాధిత కుటుంబాల సభ్యులకు వైరస్ సోకిందా? వారు ఎక్కడెక్కడ తిరిగారు? ఎంతమంది ని కలిసారు? ఇలా అనేక విషయాలపై మంత్రి చర్చించారు. వ్యాధి నియంత్రణ తదితర అంశాలపై కూడా చర్చించారు. ప్రాథమికంగా బాధిత వ్యక్తి 80 మందితో కలిసినట్లుగా ఒక అంచనాకు వచ్చినప్పటికీ అందులో 45 మందిని ఆసుపత్రికి తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల నివేదిక రావాల్సి వుంది. ఏదిఏమైనా కేసీఆర్ సర్కార్ కరోనా కంట్రోల్ పై అన్ని రకాల చర్యలు చేపట్టగా, కరోనా మాత్రం అందరిని కలవరపరుస్తోంది. కాగా, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే ఏమి కాదని, ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని, ఏలాంటి భయాందోళనలు వద్దని మంత్రి ఈటెల రాజేందర్ కోరారు.