ఆ తీర్పు ఏలా ఉన్నా…అందరూ గౌరవించాలి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, నవంబర్ 5: అయోధ్య రామ మందిరం వివాదం విషయంలో ఈ నెల 17న సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వనున్న దరిమిలా కరీంనగర్ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అన్ని అంశాలను విచారించి తుది తీర్పు ఇవ్వబోతుందని, ఆ తీర్పు ఎలా ఉన్నా అందరూ గౌరవించాలని సీపీ కోరారు. మంగళవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడారు. మత సామరస్యానికి కరీంనగర్ మారుపేరుగా నిలిచిందని, ఇది ప్రజల సహకారంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. తీర్పు నేపథ్యంలో జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు, మత పెద్దలతో సమావేశాలు నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే సోషల్ మీడియాపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుందని, ఎవరూ రెచ్చగొట్టడం లాంటి సందేశాలు పెడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే బాణాసంచా కాల్చడం, స్వీట్ల పంపిణీ, ర్యాలీలు తదితర కార్యక్రమాలు నిర్వహించరాదని, వాటిని నిషేధిస్తున్నట్లు తెలిపారు. తీర్పు సందర్భంగా ప్రజలందరూ సంయమనంతో వ్యవహరించాలని మరోమారు సీపీ కోరారు. విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికులు సీపీ, కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, ఆర్టీసీ ఆర్ఎం, డీఎం తదితర కార్యాలయాల్లో చేరవచ్చునని, విధుల్లో చేరే వారికి పూర్తి భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి శ్రీనివాస్, నగర ఎసీపీ అశోక్, సీఐలు శ్రీనివాసరావు, దేవారెడ్డి, విజ్ఞాన్ రావు తదితరులు పాల్గొన్నారు.